దిశ, శంకర్ పల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇప్పటివరకు అందలేదని ఇరుకుంట తండా సర్పంచ్ సంతోషి కుమారి శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ పల్లి మండలం ఇరుకుంట తండా అనుబంధ గ్రామమైన పొన్న గుట్ట తండాలో రూ.5లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శంకరపల్లి మండలం మహారాజ్పేట్ గ్రామ పంచాయతీ నుంచి వేరు చేసి పొన్న గుట్ట తండా, కాకర్ల గుట్ట తండా,ఇరు కుంట తండాలను కలిపి ఇరు కుంట తండా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరుకుంట తండా ఏకగ్రీవ మై మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం ఇస్తామన్న రూ.20 లక్షల ఏకగ్రీవం నిధులు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో తండాలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మూడు తండాలను కలిపి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినప్పటికీ నిధులు ఇవ్వకపోగా కనీసం రేషన్ దుకాణం కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహారాజ్ పేటకు వెళ్లి తీసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ వార్డు మెంబర్లు మున్ని, మధు నాయక్, పూజ, శారద, గ్రామ కార్యదర్శి పుష్పలత గిరిజనులు పాల్గొన్నారు.