దురాశే నిండా ముంచింది...

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ మోసాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి.

Update: 2024-09-29 12:38 GMT

దిశ, తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో సైబర్ మోసాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశ చూపి సైబర్ కేటుగాళ్లు రూ. కోట్ల మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాలు, నగరాలలో ఐఏఎస్ (ఇరీడియన్ అడ్వర్టైజింగ్ సొల్యూషన్ ) యాప్ చాప కింద నీరులా పాకింది. ఐఏఎస్ యాప్ లో అమాయకులు, నిరుద్యోగులు, విద్యావంతులతో పాటు వ్యాపారులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు చాలామంది యాప్ లో చేరారు.

    తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ప్రజలు మొబైల్ ఫోన్లో వచ్చే యాప్ లను డౌన్లోడ్ చేయడం, ఓటీపీలు అవతలి వ్యక్తులకు చెబుతూ పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నా మేలుకోవడం లేదు. ఐఏఎస్ యాప్ బాధితులు ఎంతోమంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేక, ఎవరికీ చెప్పుకోలేక లోలోన కుంగిపోతున్నారు. ఇటీవల తలకొండపల్లి మండలంలో చాలా మంది డబ్బులు పోతుండటంతో సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసి ఏమీ చేయలేక ఉండిపోతున్నారు.

ఆరు నెలలుగా తలకొండపల్లిలో చాపకింద నీరులా ఐఏఎస్ యాప్​

పేరులోనే ఉంది ఐఏఎస్. లోపల మాత్రం డొల్ల. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలామంది ఐఏఎస్ యాప్​కు బలై లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో ప్రజలు నష్టపోయారని తెలిసింది. ఐఏఎస్ యాప్ ను ఎవ్వరూ నమ్మవద్దని సోషల్​ మీడియాలో హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రంగారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల మండలమైన తలకొండపల్లిలో వేలాది మంది కేవలం ఒక ఐఏఎస్ యాప్ ద్వారా కోట్లాది రూపాయలను దండుకుంటున్నా ప్రజలు ఎందుకు మేలుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వెల్జాల్ గ్రామంలోనే సుమారు 500లకు పైగా బాధితులు ఉన్నారు.

అన్ని వర్గాల ప్రజలు ఇందులో బాధితులే

ఒక పథకం ప్రకారం ఐఏఎస్ అనే యాప్ ను యూట్యూబ్ లో రూపకల్పన చేసి నడిపించే కిలాడీలు చిన్న, మధ్య, సంపన్న వర్గాల వారిని ఆకట్టుకునే తయారు చేశారు. ఈ యాప్ లో జాయిన్ అయిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడానికి రూ.2200, రూ.5500, రూ. 18300 ఇలా ఎన్నో రకాలుగా డబ్బులు గుంజుతున్నారు. మొదట్లో అందరికీ డబ్బులు పెద్ద మొత్తంలో వస్తున్నట్లుగా నమ్మించారు.

    ఒక్కసారి ఈ ఈజీ మనీ సంపాదించడానికి అలవాటుపడ్డ వారందరూ తమకు పరిచయం ఉన్న వారందరినీ ఈ యాప్ లో చేర్పించారు. చివరకు అడ్వకేట్లు, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరి మోసపోయారు. కొంతమంది ఐఏఎస్ యాప్​ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినా మిన్నకుండిపోయారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలను చైతన్యపరిచి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.  


Similar News