‘దిశ’ ఎఫెక్ట్.. స్పందించిన మున్సిపల్ అధికారులు

అనుమతి లేని భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవు అని శంషాబాద్

Update: 2025-03-18 11:33 GMT
‘దిశ’ ఎఫెక్ట్.. స్పందించిన మున్సిపల్ అధికారులు
  • whatsapp icon

దిశ,శంషాబాద్ : అనుమతి లేని భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవు అని శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిందని సోమవారం దిశ పత్రికలో వచ్చిన కథనానికి శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు స్పందించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మనోహర్ తో పాటు మున్సిపల్ అధికారులతో అక్రమ నిర్మాణాలపై చర్చించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో మంగళవారం టౌన్ ప్లానింగ్ బృందం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లా కాలనీ లోకి వెళ్లి కాలనీలో అనుమతి లేకుండా 15 భవనాలు నిర్మిస్తున్నారు అని గుర్తించి ఆ భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం అనుమతి లేకుండా పనులు చేస్తున్నారని పనిముట్లను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళిన మున్సిపల్ అధికారులతో వాగ్వివాదానికి దిగడంతో మున్సిపల్ అధికారులు పనిముట్లు స్వాధీనం చేసుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు మాట్లాడుతూ.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సాతంరాయ్ మినహా మొత్తం 111 జీవో పరిధిలో ఉండడంతో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం కుదరదు అన్నారు. రాయల్ బిల్లాలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని దిశ పత్రికలో రావడంతో వెంబడి టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పి పనులు నిలిపివేయడం జరిగిందన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగిందని మరోసారి అక్రమ నిర్మాణ భవనాల వద్ద పనులు చేస్తే బిల్డింగ్ లు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టి నష్టపో వద్దని సూచించారు.

తూతూ మంత్రంగా పనిముట్లు తీసుకెళ్తున్నారు :  స్థానికులు

మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి మున్సిపల్ అధికారులు హడావిడి చేసి పనిముట్లు గుంజుకుపోవడమే పనిగా పెట్టుకున్నారని, ఇప్పటివరకు భవనాల వద్ద మూడుసార్లు పనిముట్లు తీసుకెళ్లారు. పనిముట్లు తీసుకెళ్లిన మున్సిపల్ అధికారులు మళ్ళీ ఇవ్వడం వల్లే మళ్ళీ పని చేసుకోవడం జరుగుతుందన్నారు. ఒకసారి పనిముట్లు తీసుకెళ్తే మళ్ళీ ఇచ్చి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడమే దాని అర్థం అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి పూర్తిస్థాయిలో పనులు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News