దారుణం.. రెండేళ్ల చిన్నారిని ఢీకొన్న సిమెంట్ ఆటో.. అక్కడికక్కడే మృతి
నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఆడుకుంటున్నారు రెండేళ్ల చిన్నారిని ఆటో

దిశ,శంషాబాద్ : నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఆడుకుంటున్నారు రెండేళ్ల చిన్నారిని ఆటో ఢీకొని మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రనగర్ దొడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కుంటపల్లికి చెందిన శివకుమార్ రేణుక దంపతులు గత రెండేళ్ల క్రితం బతుకుదెరువు కొరకు శంషాబాద్ వచ్చి లేబర్ చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఈ దంపతులకు కీర్తి (2) అనే కూతురు ఉంది. ఎంపీ జమీర్ అనే వ్యక్తి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊట్ పల్లి ఇంద్రనగర్ దొడ్డిలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద స్లాబ్ పని నిమిత్తం పనికి రెండేళ్ల కూతురు కీర్తి తో పాటు తల్లిదండ్రులు శివకుమార్ రేణుకలు వచ్చారు. రెండేళ్ల కూతురు ఇంటి ముందు ఆడుకుంటుండగా నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ లోడ్ తో వచ్చిన ఆటో చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉన్న ఏకైక కూతురు మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఊట్ పల్లి మాజీ కౌన్సిలర్ కొండ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీఓకు విరుద్ధంగా వందనాలు అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు కానీ ఏ ఒక్క రోజు కూడా అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు పరిశీలించిన దాఖలు లేవన్నారు. ఈరోజు రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ప్రాంతం కూడా అక్రమంగా నిర్మిస్తున్న భవనం కూడా చోటు చేసుకుంది అన్నారు. ఈ అక్రమ నిర్మాణ భవనానికి శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఇప్పుడు చిన్నారి మృతికి కారణమైందన్నారు. మృతికి నష్టపరిహారం ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు ఒక నిండు ప్రాణం పోయాక నష్టపరిహారం ఏం చేసుకోవాలన్నారు. చిన్నారి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకొని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చి వేయాలన్నారు.
సీపీఐ మండల కార్యదర్శి నర్రగిరి మాట్లాడుతూ..మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నో అక్రమ నిర్మాణాలు చోటుచేసుకుంటున్నాయని, ఇప్పటికే మూడంతస్తుల నిర్మించిన పూర్తి కావస్తున్న మున్సిపల్ అధికారులకు సమాచారం లేదంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చన్నారు. మున్సిపల్ అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మృతికి కారణమైన అక్రమ నిర్మాణదారుని యజమాని పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.