బీజేపీని ఓడించ‌డంపైనే త‌మ ఫోకస్: ప్రకాశ్ కార‌త్‌

Update: 2022-01-25 12:35 GMT

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: కేంద్రం స‌మాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ.. రాష్ట్రాల హ‌క్కుల‌ను కాల‌రాస్తోంద‌ని సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యులు ప్రకాశ్ కార‌త్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభల్లో భాగంగా ప్రకాశ్ కార‌త్ మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను తీసుకునే విష‌యంలో రాష్ట్రాల హ‌క్కుల‌ను కేంద్రం లాగేసుకుంటోంద‌ని, ఇలాంటి నిర్ణయాలు ప్రమాద‌క‌ర‌మ‌న్నారు. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ ప్రభుత్వాల‌న్నీ కేంద్రం నిర్ణయాలు త‌ప్పుప‌డుతున్నాయ‌ని తెలిపారు. మోడీ హ‌యాంలో దేశ ఆర్థిక ప‌రిస్థితి ఛిన్నాభిన్నమైంద‌ని, క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడింద‌ని అన్నారు. దేశంలో ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుద్యోగులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, ఉద్యోగాలు క‌ల్పించాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటోందని విమ‌ర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించే శ‌క్తుల‌కే త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని, బీజేపీని ఓడించ‌డంపైనే త‌మ ఫోకస్ ఉంటుంద‌ని తెలిపారు. యూపీలో గెలిచే స్థానాల్లో పోటీలో ఉంటామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల న‌ర్సింహారెడ్డి, జాన్‌వెస్లీ, జ్యోతి, కాడిగ‌ళ్ల భాస్కర్, జ‌గ‌దీశ్‌, కిష‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News