ప్రజాస్వామ్యం బతుకాలంటే ఆ పార్టీని తరిమి కొట్టాలి : సీఎం కేసీఆర్
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: దేశంలో మంచి పాలన సాగించేందుకు - CM KCR made sensational comments against the BJP party in Ranga Reddy district public meeting
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: దేశంలో మంచి పాలన సాగించేందుకు జాతీయ స్థాయిలో మనమందరం ఉజ్వలమైన పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసే బీజేపీని గద్దె దించేందుకు తాను ముందుంటానని అన్నారు. మతోన్మాదులతో దేశానికి భవిష్యత్తు ఉండదు.. పచ్చటి తెలంగాణలో మంటలేపుతుండ్రు.. ఇలాంటి మత, కుల పిచ్చిగాల నుంచి దేశాన్ని.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాలి, మేధావులు, విద్యావంతులు, యువత మెలుకుని ప్రజాస్వామ్యన్ని కాపాడాలని సీఎం కేసీఆర్అన్నారు. మత పిచ్చిగాళ్లు వచ్చి పచ్చటి పంటలతో ఉన్న తెలంగాణను.. మంటల తెలంగాణ గా మార్చుతే చూస్తూ ఊరుకుందామా.. ఆనాటి మన నాయకుల నిర్లక్ష్యంతో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే.. 53 ఏండ్లు తిప్పలు పడ్డాం.. మళ్లీ రాష్ట్రానికి అలాంటి తిప్పలు రాకుండా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇబ్రహీంపట్నం మండలం కొంగర్ కలాన్‌లో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్‌కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బీజేపీ నిర్లక్ష్యంతోనే ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు అందాల్సిన సాగు నీటిని సరఫరా చేయలేకపోతున్నామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేంద్రానికి వందల సార్లు దరఖాస్తులు చేశామన్నారు. మా వాటా తేల్చండని చివరికి సుప్రీం కోర్టులో కేసు వేశామన్నారు. బీజేపీ కేసును విత్‌డ్రా చేసుకోండి.. మీ వాటా తేలుస్తామని చెప్పి యేండ్లు గడుస్తున్నా పరిష్కారం చూపలేదన్నారు. ఈ ప్రాంతం ఎడారి గా మారడానికి అసలు కారకులు కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 8 యేండ్లుగా మంచి వాతావరణంలో అభివృద్ధి సాగిస్తున్న పరిపాలనలో.. జీఎస్టీ, తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఇలాంటి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మత పిచ్చిగాళ్లు, దుర్మార్గులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని స్పష్టం చేశారు. నా బలం, బలహీనతలు ప్రజలేనని ఉత్తేజపరిచారు. పంటలు పండే తెలంగాణ కావాలాన.. మత పిచ్చితో చెలరేగే మంటల తెలంగాణ కావాలా అంటూ ప్రజలను పలు మార్లు అడగడం జరిగింది. దీంతో ప్రజలు స్పందిస్తూ.. పంటలు పండే తెలంగాణ కావాలంటూ నినదించారు. మత పిచ్చిగాళ్లు చేసే పిచ్చి పనులతో తెలంగాణ అభివృద్ధి అగిపోతుందన్నారు.
దేశంలో 8 ఏండ్లుగా బీజేపీ ప్రభుత్వం తో ఏ విధమైన అభివృద్ధి సాగుతుందో మీరందరు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. బుద్ధి జీవులు, మేధావులు, యువకులు, మహిళలు నిర్లక్ష్యాన్ని వీడి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించే విధానాలపై ఊరు.. ఊరా చర్చ పెట్టాలన్నారు. దేశం, రాష్ట్రం బాగుపడాలంటే.. మన ముందు ఉన్న కర్తవ్యాన్ని పిడికిలెత్తి పోరాడి సాధించాలన్నారు. దేశం, రాష్ట్రం బాగుపడాలన్న సామరస్యపూర్వకంగా పరిపాలన సాగించాలన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన దాఖలాలు ఉన్నాయా అని మోడీ ని ప్రశ్నించారు. మంచి మనసుతో పనిచేసినప్పుడే మంచి పరిపాలన అందించాగలమన్నారు.
ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు సీపాయిలు అయితే, అంత గొప్పవారైతే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నాణ్యమైన ఉచిత కరెంట్‌ను 24 గంటల పాటు సరఫరా చేయాలని డిమాండ్‌చేశారు. అంతేకాకుండా దేశంలో 70 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయని అన్నారు. ఆ నీళ్లను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియని దుస్థితి కేంద్ర ప్రభుత్వానిదని విమర్శించారు. ఈ నీళ్లను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచి నీళ్లు ఇచ్చే సోయి లేకపాయేనని బీజేపీ ప్రభుత్వాన్ని సీఎం ఎండగట్టారు.
తెలంగాణ రాష్ట్ర రాజధానీయైన హైదరాబాద్‌లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాము.. దేశ రాజధానియైన ఢిల్లీలో కరెంటు ఎందుకు ఉండదు.. నీళ్లు ఉండవు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు అవకాశం ఇస్తే అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం అమలు కోసం పని చేయాలి తప్పా కుటిల రాజకీయం చేయరాదని అన్నారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాడిన ప్రభుత్వాలను కూల్చివేశారని అన్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాడిన స్టాలిన్ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ నేతలు మాట్లాడే మాటలకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో మమత ప్రభుత్వాన్ని, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాలను కూల్చివేయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. నిన్న, మొన్నటి వరకు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఆఫర్చేసిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలను అరాచకంగా మారుస్తున్నారని బీజేపీని విమర్శించారు.
ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించిన 100 ఏండ్ల పాటు అవస్తలు పడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఒక నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్రాష్ట్రాన్ని విలీనం చేసినపుడు తెలంగాణ ప్రజలు అనుభవించిన బాధలు గుర్తు చేసుకోవాలన్నారు. ఆనాడు మన నాయకులు వ్యవహరించిన నిర్లక్ష్యంతోనే గోస పడ్డమన్నారు. ఆ గోస తిరిగి పునరావృతం కావొద్దంటే అందరూ మేలు కోవాల్సిన అవసరం ఉందన్నారు. కవులు, కళాకారులు, మేధావులు, కుల వృత్తులు ప్రతి ఒక్కరు ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం 1946లో 400 మంది, మలిదశ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, ఉద్యమ నాయకులు, ప్రజలు బలిదానాలు చేశారన్నారు.
ఎలాంటి హింసలకు తావు లేకుండా చేసిన ఉద్యమంలో కూడా అనేక కష్ట నష్టాలను భరించామన్నారు. చిన్న నిర్లక్ష్యంతో 53 ఏండ్లుగా తిప్పలు పడ్డామన్నారు. ఇన్ని సాక్షాలు మీ కండ్ల ముందే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరుగుతున్న అభివృద్ధిలో వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెల రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016 చొప్పున ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 5 వేలు, బీమా కింద రూ. 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
అంతే కాకుండా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇలాంటి అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఏ దేశంలో.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందన్నారు. తెలంగాణలో 93 శాతం చిన్న, సన్న కారు రైతులకు రైతు బీమా, బంధు అందిస్తున్నామన్నారు. ఒక గుంట భూమి ఉన్న రైతుకు ఏదైనా ప్రమాదంతో మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు వారం రోజుల్లో తమ ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌సరఫరా చేస్తున్నామన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈ సంక్షేమ సదుపాయాలు కాపాడు కోవాలా.. పోగొట్టు కొవాలా ప్రజలు ఆలోచించాలన్నారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్అధ్యక్షుడిగా తెలంగాణ కోసం పోరాడిన బిడ్డను కాబట్టే ఏదీ ఏమైనా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సీఎం సభ బోర్.. మధ్యలోనే వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్న పోలీసులు (వీడియో)