కబ్జా చెరలో చందన చెరువు

మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్​మండల రెవెన్యూ పరిధిలోని మీర్​పేట్ మున్సిపల్​కార్పొరేషన్​లోని జిల్లెల్ ​గూడలో చందన చెరువు ఒకప్పుడు సాగు త్రాగు నీటి కష్టాలు తీర్చిన జలవనరులు కుదించుకు పోయి అత్యంత దయనీయంగా మారింది.

Update: 2024-09-02 04:30 GMT

దిశ, బడంగ్ పేట్ / మీర్​ పేట్: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్​మండల రెవెన్యూ పరిధిలోని మీర్​పేట్ మున్సిపల్​కార్పొరేషన్​లోని జిల్లెల్ ​గూడలో చందన చెరువు ఒకప్పుడు సాగు త్రాగు నీటి కష్టాలు తీర్చిన జలవనరులు కుదించుకు పోయి అత్యంత దయనీయంగా మారింది. జిల్లెల్​గూడా ప్రధాన రహదారిలో ఉన్న 32 ఎకరాలలో చందన చెరువు విస్తరించి ఉండేది. ఆ చెరువు పక్కనే ఎఫ్​ టిఎల్​తో పాటు ప్రభుత్వ స్థలం కూడా పెద్ద ఎత్తున ఉండేది. అంతా కలిపి 82 ఎకరాల వరకు ఉన్న స్థలం కాస్త నేడు 20 ఎకరాలకు మాత్రే కుదించుకుపోయిందంటే ఎంత పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైందో ఇట్టే అర్థం అవుతుంది. ఈ చెరువు వెనకాల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అంతేగాకుండా ఆ చెరువు పరిసర భూములను భూములు మాన్యం కింద పొందిన వారంతా ఈ చెరువు నీటి పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుని తమ జీవనాన్ని కొనసాగించారు. చందన చెరువు కింద ఒకప్పుడు భూమి సాగు చేసుకుని జీవించిన కుటుంబాలు కబ్జాలకు సాక్షులుగా మిగిలారు తప్ప భూ కబ్జాదారులను ఎదురించి చెరువును కాపాడలేకపోయారు.

ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు. అందులో కమర్షియల్​తో పాటు రెసిడెన్షియల్​ పర్పస్​ కూడా బహుళ అంతస్థుల భవనాలను అడ్డూ అదుపు లేకుండా కట్టారు. ​ప్రస్తుతం ఓ ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​తో పాటు, పెట్రోల్​ బంక్​, స్విమ్మింగ్​ ఫూల్​, లారీల షెడ్డు నిర్మాణాలు కనిపిస్తాయి. కొందరయితే ఏకంగా వెంచర్​లు చేసి ప్లాట్​​లుగా కూడా విక్రయించారు. అంతేగాకుండా కొందరికి చందన చెరువును ఆక్రమించి కట్టుకున్న బహుళ అంతస్తు భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారు? ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోలేదు? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తక్కువ ధరకు వస్తుందన్న ఆశతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసి సొంత ఇంటి కలను నేరువేర్చుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ముందుగా కమర్షియల్​ నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన హైడ్రా అధికారులు కూల్చివేయాలని, కబ్జాకు గురైన మాన్యం భూములు తిరిగి తమకు అప్పగించాలని అంబేద్కర్​ వెల్ఫేర్ అసోసియేషన్​ ప్రతినిధులు కోరుతున్నారు.

వివరాలలోకి వెళితే..

చందనం చెరువుకు ఎంతో ఘన చరిత్ర కలిగి ఉన్నది. ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువుల కింద నిర్మించబడ్డాయి. చందనం చెరువు పైన మిథిలా నగర్​, సత్య సాయి నగర్​, అల్మాస్​గూడ, బడంగ్ పేట్​ నుంచి వరద నీళ్లు ఈ చెరువులోకి వచ్చి చేరేవి. ఒకప్పుడు సాగు త్రాగు నీటి కష్టాల కోసం చందన చెరువు నీళ్లను ఉపయోగించుకునే వారు. ఇది ఇలా ఉండగా ఆర్​సిఐ రోడ్డు కు వెళ్లడానికి వేరే మార్గం లేక పోవడంతో 1990లో అప్పటి ప్రభుత్వమే చెరువు శిఖం లోంచి రోడ్లు వేసింది. రోడ్డు పక్కన ఎఫ్‌టిఎల్ భూములు ఉండడంతో అక్కడి వరకు అధికారులు సర్వే చేసి హద్దులు కూడా ఏర్పాటు చేశారు. ఆర్‌సిఐకి ఈ చెరువు నుంచి నీటిని సరఫరా చేసేందుకు శిఖంలో ఒక ట్యాంకును కూడా నిర్మించారు. రోడ్డును అడ్డుగా పెట్టుకున్న కబ్జాదారులు రోడ్డు అవతల వరకు మాత్రమే శిఖం భూములని, రోడ్డు ఇవతల అంతా ప్రైవేటు దని, మా స్థలం అంటూ యధేచ్చగా కబ్జాలకు పాల్పడ్డారు.

చందనం చెరువును కుదించి వాకింగ్​ ట్రాక్​ నిర్మాణం..

పూర్వం నవాబులు చందనం చెరువు కింద ఉన్న సాగు భూమిని స్థానిక దళితులకు వ్యవసాయం చేసుకోవడానికి మాన్యం కింద కేటాయించారు. 1993 వరకు కూడా దళిత కుటుంబాలు మాన్యం భూములను సాగుచేసుకుని జీవించేవారు. ఇక ఈ చందన చెరువులో కొంత భాగం కబ్జాకు గురయ్యింది. మిగిలిన కొంత చెరువు భాగంలో స్థానికులు కాలనీలోకి వెళ్లేందుకు వీలుగా రోడ్లు వేశారు. ఇంకా మిగిలిన చెరువు తీరంలో సుందరీకరణ పేరుతో చెరువులో మట్టి పోసి వాకింగ్​ ట్రాక్​ ను నిర్మించారు. చెరువులో నిర్మించిన వాకింగ్​ ట్రాక్​ లో ఒక దగ్గర యోగా కోసం ప్రత్యేకంగా స్థలం కూడా కేటాయించారు. మరో చోట చిన్న పార్కు ఏర్పాటు చేశారు. ఇంకా చెరువు చుట్టూ ఉన్న బఫర్​ జోన్​లో ఒక చోటయితే స్థానిక నాయకుడు ఎస్​వైఆర్​ కన్వెన్షన్​ పేరిట ఫంక్షన్​ హాల్​ కూడా నిర్మించాడు.

మరి కొంత మంది స్విమ్మింగ్​ ఫూల్​ తదితర కమర్షియల్​ కట్టడాలతో పాటు బహుళ అంతస్థు భవనాలను నిర్మించారు. మరో నాయకుడు ఇష్టానుసారంగా చెరువు భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. మిగిలిన చందన చెరువు కాస్త చెరువులా కాకుండా నీటి గుంటలా మారింది. చందన చెరువు చుట్టూ కబ్జాలు పెరిగిపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. చెరువు చుట్టూ ఫంక్షన్​ హాల్​ తో పాటు ఇతర ప్రైవేటు​ నిర్మాణాలు పెరిగిపోవడంతో చందన చెరువులోకి నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వరద నీరు చెరువులోకి రాకుండా కాలనీలను ముంచెత్తుతున్నాయి. అంతేగాకుండా డ్రైనేజీ నీరు కూడా చెరువులో కలుస్తుండడంతో చెరువు ప్రస్తుతం మురికి కూపంగా మారింది. ఇప్పటికయినా చందన చెరువు చుట్టూ నిర్మాణాలు అపకపోతే పరిస్థితులు తీవ్ర తరమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కబ్జాదారుల చెర నుంచి చందన చెరువును విడిపించండి.

మూడు ఎకరాల మాన్యం భూమిలో మా పూర్వీకులు అందరూ కూడా సాగు చేసుకుని వ్యవసాయం చేసేవారు. 20 ఎకరాల వరకు కబ్జాకు గురి కావడం జరిగింది. 92,93 వరకు మా పూర్వీకులు వ్యవసాయం చేశారు. చందనం చెరువు కబ్జాకు గురౌతుందని, స్థానిక తహశీల్దార్​కు, ఆర్​డిఓ కు, కలెక్టర్​కు, హెచ్‌ఎండి‌ఎ, ఇరిగేషన్​ అధికారులకు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. గతంలో ఇరిగేషన్​ అధికారులు కూడా వచ్చి సర్వే చేసి మా మాన్యం భూమికి సంబంధించిన హద్దులు కూడా పాతడం జరిగింది. ఎఫ్​టిఎల్​ హద్దులు కూడా పాతడం జరిగింది. గతంలో ఎమ్మార్వో , ఆర్డీవో లు వచ్చి కూడా పంచనామా చేసి మా స్థలంలో నిర్మిస్తున్న సామయాదిరెడ్డి ఫంక్షన్​ హాల్​ను ఆపడం కూడా జరిగింది. ఎకరం 8 గుంటల కు చెందిన మా స్థలాన్ని కూడా స్థానిక నాయకులు రిజిస్ట్రేషన్​ చేసుకుని అమ్మకం పెట్టినప్పుడు కూడా ఫిర్యాదులు చేశాం. దాదాపు 50 నుంచి 60 కోట్ల విలువ గల భూమిని కబ్జా చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. చందన చెరువు కబ్జాకు గురవుతుందని చెరువు పరిరక్షణ సమితి ద్వారా కూడా ఎన్నో పోరాటాలు చేశాం. చెరువు స్థలం ఏదో మూలకు ఉంటే వేరే వాళ్లకు ప్రయోజనం చేసే విధంగా దాన్ని కుదించి వాకింగ్​ ట్రాక్​ నిద్రిస్తున్నప్పుడు కూడా అడ్డుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ గొలుసుకట్టు కాల్వలు కూడా పునరుద్దరించాలి. కబ్జాదారుల నుంచి చందన చెరువును వెంటనే కాపాడాలి.:-అంబేద్కర్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బై గళ్ళ ఓం ప్రకాష్


Similar News