Disha Effect : ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు

మండల పరిధిలోని వేములనర్వ గ్రామ శివారు సర్వే నెంబర్ 119,120,121,122 లోని "ప్రభుత్వ భూమికి రెక్కలు?" "50 కోట్ల భూమి పై రియల్టర్ ల కన్ను" పేరిట దిశ దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది.

Update: 2024-10-27 09:45 GMT

దిశ,కేశంపేట: మండల పరిధిలోని వేములనర్వ గ్రామ శివారు సర్వే నెంబర్ 119,120,121,122 లోని "ప్రభుత్వ భూమికి రెక్కలు?" "50 కోట్ల భూమి పై రియల్టర్ ల కన్ను" పేరిట దిశ దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు తహసీల్దార్ ఆజం అలీ ఆదేశాలతో ఆ ప్రభుత్వ భూమిలో బోర్డు ఏర్పాటు చేశారు. సర్వేనెంబర్ 119లో 15.27 ఎకరాలు, సర్వే నెంబర్ 120 లో 12.08 ఎకరాలు,సర్వే నెంబర్ 121 లో 10.06 ఎకరాలు,సర్వే నెంబర్ 122 లో 13.03 ఎకరాలు మొత్తం 51..04 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో ఎవరైనా ప్రవేశించిన కబ్జా చేయడానికి ప్రయత్నించిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ఆజం అలీ మాట్లాడుతూ… ఈ సర్వే నెంబర్ లోని భూములను గతంలో కొంతమంది ఎస్టీ రైతులకు భూదానం చేశారని, ఆ రైతులు ఆ భూములను ఇతరులకు విక్రయించారని, వారు కూడా ఇతరులకు విక్రయించారని ఇలా భూదాన్ భూములను అమ్ము కుంటుండడంతో 2009వ సంవత్సరంలో ప్రభుత్వం ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధీనంలోనే ఈ భూములు ఉన్నాయన్నారు.

ఇలాంటి భూములలో ఇతరులు ఎవరూ లావాదేవీలు జరపకూడదనే ముఖ్య ఉద్దేశంతో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దాదాపు 51 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా దిశ దినపత్రికలో వచ్చిన కథనం తోడ్పడిందని అన్నారు. దీని ద్వారా అధికారులు అప్రమత్తమయ్యి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారని అందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


Similar News