మధ్యవర్తులతో టౌన్ప్లానింగ్అధికారుల బేరసారాలు
హైదరాబాద్కార్పొరేషన్పరిధి విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో నిర్మాణాలు కూడా విపరీతంగా కొనసాగుతున్నాయి.
దిశ, రంగారెడ్డి బ్యూరో: హైదరాబాద్కార్పొరేషన్పరిధి విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో నిర్మాణాలు కూడా విపరీతంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాలు సక్రమమా.. అక్రమమా? అనే వ్యవహారం స్పష్టం చేయాల్సింది టౌన్ ప్లానింగ్ అధికారులు. కానీ ఆ టౌన్‌ప్లానింగ్ అధికారుల కొరతతో అక్రమార్కులు ఆడిందే ఆట, పాడిందే పాట గా పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతున్నది. కాగా, వారంలో రోజుకు ఒక్క మున్సిపాలిటీలో వారు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ పట్టణంలో జరిగే నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు ఆయా మున్సిపాలిటీల్లో నిర్మాణాలకు అనుమతి తీసుకుంటే పలుకుబడి కలిగిన నేతలతో, కమిషనర్లతో అంటకాగే వాళ్లు మధ్యవర్తులుగా ఉండి బేరసారాలు నడిపిస్తున్నారు.
బేరం కుదిరితే అక్రమ నిర్మాణమైన సక్రమమని టౌన్ప్లానింగ్అధికారి, కమిషనర్లు అనుమతిస్తున్నారు. దీనంతటికీ కారణం టౌన్‌ప్లానింగ్ అధికారులు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించకపోవడమేనని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే స్థానిక పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన అధికారి, అనుమతులు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే స్పందించే అవకాశం టౌన్‌ప్లానింగ్ అధికారులకే ఉంటుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే పూర్తిస్థాయిలో పనిచేసే టౌన్‌ప్లానింగ్ అధికారులు మున్సిపాలిటీల్లో ఉండాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
16 మున్సిపాలిటీలకు ఐదుగురే అధికారులు..
మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం పాత్ర కీలకం. నిర్మాణాలకు సంబంధించిన ప్రతి అంశం ఈ ప్లానింగ్ అధికారులే పరిశీలించాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో మూడు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలుంటాయి. ఇందులో కేవలం ఐదుగురు మాత్రమే టౌన్‌ప్లానింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 16 మున్సిపాలిటీల్లో ఐదుగురే టౌన్ ప్లానింగ్ అధికారులు వారానికి ఒక్క చోట వంతుల వారీగా విధులు నిర్వహించడం గమనార్హం. దీంతో నిర్మాణ అనుమతుల జారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. టీఎస్ బీపాస్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి 24 గంటల్లోనే అనుమతులు జారీ చేయాల్సి ఉన్నా రెండు, మూడు వారాలైనా చేయడం లేదు.
వారాల పద్ధతిలో అధికారులు విధులు..
– జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన టీపీవో ఆదిభట్ల మున్సిపాలిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సోమ, మంగళ, బుధ వారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటారు. హెచ్ఎండీఏ జీ+4 నిర్మా ణాలకు, మున్సిపాలిటీ జీ+2 నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నది.
– బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లోనూ డీసీపీ సహా డీపీవో సైతం షిఫ్ట్ పద్ధతుల్లోనే పని చేస్తున్నారు. వీరిద్దరూ వారానికి మూడు రోజుల చొప్పున షిఫ్ట్ పద్ధతిలోనే పని చేస్తున్నారు.
– సంగారెడ్డి జిల్లా సదాశివపేట కు చెందిన టీపీవో తుక్కుగూడ మున్సిపాలిటీలో టీపీవో ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం జాతీయ రహదారి వెంట ఉన్న వ్యవసాయ భూముల్లో అక్రమ షెడ్లు, సెల్లార్ల తవ్వకాలు చేపడుతున్నారు. వక్ఫ్ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా అడ్డుకునే వారే లేకుండా పోయారు. అక్రమ నిర్మాణాలకు రూ.2 లక్షలు తీసుకొని ఇంటి నంబర్లు కూడా జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
– ఇబ్రహీంపట్నం టీపీవో తుర్కయంజాల్, షాద్ నగర్ మున్సిపాలిటీల్లో ఇన్చార్జి గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ టీపీవో ఒక్కో మున్సిపాలిటీలో రెండు రోజుల చొప్పున పని చేయాల్సి వస్తుంది. సోమ, మంగళవారాల్లో తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉంటుండగా.. బుధ, గురువారాల్లో షాద్ నగర్ మున్సిపాలిటీలో.. శుక్ర, శని వారాల్లో ఇబ్రహీంపట్నంలో ఉంటున్నారు.
– వికారాబాద్ మున్సిపాలిటీకి చెందిన టీపీవో మీర్పేట్ మున్సిపాలిటీ సహా మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలోనూ టీపీవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో మాత్రమే మీర్పేట్లో ఉంటారు. మిగిలిన రోజుల్లో ఇతర మున్సిపాలిటీల్లో ఉంటున్నారు.
– తాండూరు మున్సిపాలిటీకి చెందిన టీపీవో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు టీపీవో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. గురు, శుక్ర, శనివారాల్లో అందుబాటులో ఉంటారు. నెలకు సగటున 150 దరఖాస్తులు వస్తుంటాయి. వందకుపైగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు.
అక్కడ చైన్మెన్లదే హవా..
నిజానికి ప్రతి మున్సిపాలిటీలో విధిగా డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ), అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీ పీ), టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీవో), టౌన్ ప్లానిం గ్ సూపర్వైజర్ (టీపీఎస్)తో పాటు చైన్ మన్ సిస్టం ఉండాలి. నిర్మాణ సైట్ వెరిఫికేషన్ మొదలు అక్రమ నిర్మాణాల గుర్తింపు, స్థానిక ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందితో చైన్ మన్ సిస్టం ఏర్పాటు చేయడంతో వారే టీపీవోలుగా చలామణి అవుతూ అక్రమ నిర్మాణదారుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్రంలోనే అత్యధిక నిర్మాణాలు ఆదిభట్ల, తుక్కుగూడ, బడంగ్‌పేట్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్నాయి. కీలకమైన ఈ మున్సిపాలిటీల్లోనూ రెగ్యులర్ టీపీవోలు లేని పరిస్థితి నెలకొంది.