రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు..

భార్యాభర్తలు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా,బైక్ ఢీకొనడంతో భర్త మృతి చెందిన ఘటన బొంరాస్ పేట్ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-12-26 03:38 GMT

దిశ, బొంరాస్ పేట్ : భార్యాభర్తలు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా,బైక్ ఢీకొనడంతో భర్త మృతి చెందిన ఘటన బొంరాస్ పేట్ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుర్రి తండాకు చెందిన కేతావత్ లోక్యానాయక్ (45), బుజ్జిబాయి(43)లు ఇద్దరు భార్యాభర్తలు బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత, రాత్రి 11:30 గంటల సమయంలో పొలం దగ్గర ఉన్న వేరుశనగ కల్లం దగ్గరకు కాపలాకు నడుచుకుంటూ వెళుతున్నారు. సరిగ్గా చెక్ పోస్ట్ సమీపంలో 163 హైదరాబాద్ - బీజాపూర్ రహదారిని రోడ్డు దాటుతుండగా పరిగి వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని బైక్ భార్యాభర్తలను ఇద్దరిని ఢీ కొట్టింది.

లోక్యానాయక్ కాలు, చేతులు విరిగి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతనిని పరిగి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు వికారాబాద్ కు రిఫర్ చేయడంతో అతడిని వికారాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లోక్యానాయక్ మృతి చెందాడు. భార్య బుజ్జిబాయికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. లోక్యా నాయక్ మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Similar News