అన్నదాతను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి : మంత్రి తుమ్మల

ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఆరుగాలం శ్రమిస్తూ దేశానికి అన్నం

Update: 2024-07-02 14:08 GMT

దిశ, రాజేంద్రనగర్ : ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఆరుగాలం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. మంగళవారం రాజేంద్రనగర్ లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీజిఐఆర్డి)లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ భవన సముదాయాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి వ్యవసాయ, ఉద్యానవన, ఇతర అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికే కాకుండా యావత్ సమాజానికి ప్రధాన వనరుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రానున్న రెండు మూడు నెలల వ్యవధిలోనే రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా కార్యక్రమాల ద్వారా అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం సుమారు రూ. 50 వేల కోట్ల పైచిలుకు నిధులను వెచ్చించనుందని వెల్లడించారు. ప్రభుత్వ ఖజానా పై ఎనలేని భారం పడుతున్నప్పటికీ, రైతుల శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం సాగు రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతు నేస్తం కార్యక్రమాల ద్వారా అన్నదాతల అభిప్రాయాలతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల సలహాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, అన్ని వర్గాల ప్రజల సూచనలను క్రోడీకరించి వారి మనోభావాలకు అనుగుణమైన నిర్ణయాలతో రైతు భరోసాను అమలు చేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క రైతు రుణమాఫీ ద్వారానే రూ.31 వేల కోట్ల మేరకు రైతాంగానికి ప్రయోజనం చేకూర్చనున్నామని, పాత పద్ధతి ప్రకారమే రుణమాఫీ అమలు జరుగుతుందని వెల్లడించారు. ఈ ఏడాది నుండే రైతు బీమాను సైతం అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందని అన్నారు.

ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. వివిధ కారణాల వల్ల సాగు రంగంలో నెలకొన్న స్తబ్దతను దూరం చేస్తూ, వ్యవసాయ శాఖ అన్ని విధాలుగా తమకు అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని రైతుల్లో పెంపొందించాలని సూచించారు. అధికారులు తమ అనుభవాన్ని, విషయ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి రైతు వరకు చేరుస్తూ, వారి కష్ట నష్టాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భూమి సారాన్ని బట్టి ఏ రకమైన పంటలు వేయాలి, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఏ పంట సాగు చేస్తే లాభాలు వస్తాయి, నూతన వంగడాలు, అధునాతన పద్ధతుల గురించి రైతాంగాన్ని చైతన్యపరచాలని అన్నారు. అప్పుడే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేగలుగుతామని, అన్నదాతను ఆర్థికంగా అభివృద్ధి చేయగలుగుతామని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అధిగమించేలా అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ఒక్కో రైతు వారీగా, వ్యవసాయ క్షేత్రాల సర్వే నెంబర్ ప్రకారంగా భూసార పరీక్షలు నిర్వహిస్తూ, వాటి ఫలితాలను రైతులకు అందజేయాలని సూచించారు. నేల స్వభావాన్ని బట్టి తగిన పంటలు సాగుచేసేలా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని మంత్రి అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ, నాసిరకం ఎరువులు, విత్తనాలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ చేయాలని, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతాంగ ప్రయోజనాల కోసం కృషి చేసే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ఎల్లవేళలా తోడ్పాటుగా నిలుస్తుందని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమార్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాష, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, నిఖిల, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ రఘురాం, ఎమ్.డి ఆఫ్ మార్కఫెడ్ సత్యనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News