సీఎంఆర్ ​లక్ష్యం చేరేనా..?

రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండడంతో టెండర్లతో పనిలేకుండా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం మాత్రమే మిల్లులకు సరఫరా చేయనున్నారు.

Update: 2024-07-04 02:19 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండడంతో టెండర్లతో పనిలేకుండా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం మాత్రమే మిల్లులకు సరఫరా చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కేవలం 5 మిల్లులు, వికారాబాద్​లోని 10 మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని అప్పగిస్తారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయించిన తేదీలోపు సీఎంఆర్‌ను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే పద్ధతిలో రంగారెడ్డి జిల్లాలో 7‌‌0 శాతం, వికారాబాద్‌లో 10 శాతం సీఎంఆర్ సేకరించారు. మిగిలిన సీఎంఆర్​ అందుబాటులో ఉన్నప్పటికి సివిల్ సప్లై​ అధికారులు సూచనతో అడుగులు వేయనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. కేవలం రంగారెడ్డి, వికారాబాద్ ​జిల్లాల్లో సేకరించిన ధాన్యం కేవలం ఎఫ్సీఐకి మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో 4 శాతమే సీఎంఆర్ బకాయి..

2022-23 వానాకాలం సీజన్‌లో పౌర సరఫరాల శాఖ (సివిల్‌ సప్లై), డీఆర్‌డీఏ, ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యంలో రంగారెడ్డి జిల్లాలో ఐదు మిల్లర్ల ద్వారా 13,825 మెట్రిక్​ టన్నుల బియ్యం సీఎస్సీ, ఎఫ్సీఐకి అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 13,188 మెట్రిక్​ టన్నుల బియ్యం అందజేయగా.. మిగిలిన 4శాతం సీఎంఆర్​చెల్లించాల్సి ఉంది. అయితే అమన్‌గల్లులోని రైస్​మిల్లర్ల యాజమాన్యం సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో కేసు నమోదు చేసినట్లు సంబంధిత జిల్లా అధికారి వివరించారు.

గడువు ముగియడంతో సీఎంఆర్ కు జాప్యం..

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలోని 2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం ఆశించిన స్థాయిలో సేకరించారు. రంగారెడ్డిలో 41,305 మెట్రిక్ టన్నులు, వికారాబాద్‌లో 1,07,657 మెట్రిక్​ టన్నుల ధాన్యం మిల్లర్లకు తరలించారు. ఇందులో సీఎంఆర్​ద్వారా రంగారెడ్డికి 27,877, వికారాబాద్‌కు 72,771 మెట్రిక్​ టన్నుల చొప్పున మిల్లర్లు అందజేయాలి. ఇప్పటి వరకు రంగారెడ్డికి 19,845 మెట్రిక్​టన్నులు (70శాతం), వికారాబాద్‌కు 70,002 మెట్రిక్​ టన్నులు (10శాతం ) చొప్పున మాత్రమే ఎఫ్సీఐ, సీఎస్సీకి అప్పగించారు. మిగిలిన రైస్​రంగారెడ్డిలో 8,600, వికారాబాద్‌లో 65,769 మెట్రిక్​ టన్నుల బియ్యం మిల్లర్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద బియ్యం అందుబాటులో ఉన్నప్పటికీ ఎఫ్సీఐ తీసుకునేందుకు సమయం ఇవ్వకపోవడంతో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. వికారాబాద్​ జిల్లాలో మాత్రం మిల్లర్లు కావాలనే సీఎంఆర్​ చెల్లింపునకు నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

2023–24 వానాకాలం, యాసంగి సీఎంఆర్​ చెల్లింపు అక్టోబర్ వరకు..

వానకాలం, యాసంగి సీజన్‌లో ప్రభుత్వం సేకరించిన ధాన్యం రైస్​మిల్లర్లకు తరలించారు. వానకాలం​ సీజన్‌లో రంగారెడ్డిలో 9,879 మెట్రిక్​టన్నుల ధాన్యం మిల్లర్లకు తరలిస్తే.. 6,663 మెట్రిక్​ టన్నుల బియ్యం సీఎంఆర్​ద్వారా చెల్లించాలి. కానీ 4,939 మెట్రిక్​ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి, సీఎస్సీకి అప్పగించారు. వికారాబాద్‌లో 44,252 మెట్రిక్​ టన్నుల ధాన్యం మిల్లర్లకు పంపిణీ చేస్తే 29,558 మెట్రిక్​ టన్నుల బియ్యం ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ కేవలం 14,363 మెట్రిక్​ టన్నులు మాత్రమే అప్పగించారు. రంగారెడ్డిలో 74శాతం, వికారాబాద్‌లో 52 శాతం చొప్పున చెల్లించడంతో అనుమానాలకు తావిస్తున్నది. అక్టోబర్ నెల వరకు సీఎంఆర్​చెల్లించే అవకాశం ఎఫ్సీఐ కల్పించినట్లు అధికారులు వివరిస్తున్నారు. యాసంగి సీజన్‌లోని ధాన్యం కూడా రంగారెడ్డిలో 12,167 మెట్రిక్​ టన్నులు, వికారాబాద్‌లో 38,671 మెట్రిక్​ టన్నులు మిల్లర్లకు పంపిణీ చేశారు. సీఎంఆర్​ ద్వారా రంగారెడ్డికి 8,273, వికారాబాద్‌కు 26,296 మెట్రిక్​ టన్నుల చొప్పున బియ్యం అప్పగించారు. ఇంకా రంగారెడ్డిలో 7983, వికారాబాద్‌లో 23,717 మెట్రిక్​ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉందని అధికారిక వివరాలు చెబుతున్నాయి.

2023–24 సీజన్ సీఎంఆర్‌కు సమయం ఉంది

సీఎంఆర్​ ద్వారా ఎఫ్సీఐకి, సీఎస్సీకి అందాల్సిన బియ్యం సకాలంలోనే వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 2022–23 వానకాలం​ సీజన్‌లో సీఎంఆర్ 4 శాతం బకాయి ఉంది. అందుకు కారణమైన అమన్‌గల్లు రైస్‌మిల్లుల్లో స్టాక్​ లేదని జాప్యం చేస్తున్నారు. దీంతో ఆ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేశాం. 2023–24 వానకాలం, యాసంగి సీజన్‌లో సేకరించిన ధాన్యం మిల్లులకు తరలించారు. సీఎంఆర్​ ద్వారా జిల్లాకు రావాల్సిన బియ్యం తీసుకుంటున్నాం. 2023–24 సీజన్‌కు సంబంధించి సీఎంఆర్​ తీసుకోవడంలో అక్టోబర్ వరకు సమయం ఉంది. :–విజయలక్ష్మి, జిల్లా మేనేజర్​ రంగారెడ్డి


Similar News