'మునుగోడు ఓటర్లను గుడికి కాదు కాళేశ్వరానికి తీసుకువెళ్లండి'
మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి యాదగిరిగుట్టకు తీసుకువెళ్లి ప్రత్యేక దర్శనాలు చేయించిన ఘటపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి యాదగిరిగుట్టకు తీసుకువెళ్లి ప్రత్యేక దర్శనాలు చేయించిన ఘటపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మునుగోడు ఓటర్లకు చూపించాల్సింది యాదగిరిగుట్ట గుడి కాదని వారిని కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకువెళ్లి బాహుబలి మోటార్లను చూపించాలని ఎద్దేవా చేశారు. అలా చేస్తే మీరు చేసిన దోపిడీ ఏమిటో మునుగోడు ప్రజలకు తెలుస్తోందని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గం దండుమల్కాపురం గ్రామానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆ గ్రామస్తులను 15 బస్సుల్లో యాదాద్రికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్నది. స్వామి వారి సేవలను నిలిపివేయించి మరి గ్రామస్తులకు స్పెషల్ దర్శనం చేయించారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే గ్రామస్తులు టీఆర్ఎస్‌కే ఓటు వేయించేలా జీవన్ రెడ్డి యాదగిరిగిట్టలో ఒట్టు వేయించారని, ఇది ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయడమే అవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించిన రాజగోపాల్ రెడ్డి జీవన్ రెడ్డి వ్యవహారంపై మండిపడ్డారు. ఓట్ల కోసం మునుగోడు ప్రజలను తీసుకువెళ్లాల్సింది యాదగిరిగుట్టకు కాదని కాళేశ్వరం ప్రాజెక్టు టూర్‌కు తీసుకువెళ్లి అక్కడి పరిస్థితిని చూపించాలని ఎద్దేవా చేశారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపు హౌస్‌లోకి వరద నీరు చేరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తప్పిదాల వల్లే కాళేశ్వరం మోటార్లు ముంపునకు గురయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వరదల కారణంగా పంప్ హౌస్‌లకు ఏర్పడిన నష్టాన్ని పరిశీలించేందుకు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తామని ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం వారిని అడ్డుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తే ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు అవుతుందనే తమను అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి ఈ తరహా విమర్శలు చేయడం ఆసక్తిగా మారింది.