Raghunandan Rao: గోడలకు సున్నాలేసుకునే వారికి అర్థం కాదు.. సీఎంపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు.

Update: 2024-07-27 10:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపు అంశంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునంధన్ రావు ఘాటు విమర్శలు చేశారు. గోడలకు సున్నాలేసుకునే ఏడో తరగతి చదువుకున్న వారికి బడ్జెట్ అర్థం కాదని విమర్శించారు. పక్కన చదువుకున్న వారిని పెట్టుకుంటే బడ్జెట్ ఏంటో అర్థం అవుతుందన్నారు. శనివారం మెదక్ లో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.26 వేల కోట్లు, స్టేట్ ట్యాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్ లో రూ.22 వేల కోట్లు వస్తున్నాయన్నారు. ఇది నా సొంత కవిత్వం కాదని బడ్జెట్ లో భట్టి విక్రమార్కనే రాశారని సెటైర్ వేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు వస్తాయని దీనిలో తెలంగాణకూ వస్తాయన్నారు. వీటినే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పేరుతో కొత్త కథ మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కారుకూతలు కూసినా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడో దఫా ఐదేళ్లు విజయవంతంగా పని చేస్తుందన్నారు. బడ్జెట్ పై దుష్ప్రచారం చేసే వారికి బడ్జెట్ అంటే ఏంటో తెలియదని తెలంగాణ సమాజం గ్రహించాలన్నారు. బడ్జెట్ లో తెలంగాణ పేరు రాలేదని అంటున్న రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతున్నా.. యూపీ, రాజస్థాన్, గుజరాత్ పేర్లు వచ్చాయా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News