ఐస్ గడ్డతో చంపే రకం.. మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధు తీవ్ర వ్యాఖ్యలు

రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-07-11 14:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథని ఎమ్మెల్యే ,రాష్ట్ర మంత్రి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేస్తే 45 రోజులుగా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రత్యర్థుల మీద రౌడీ షీట్‌లు తెరవడానికే మంత్రి తన సమయాన్ని వెచ్చిస్తున్నారని, పైకి సౌమ్యంగా కనిపించే మంథని ఎమ్మెల్యే చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, ఐస్ గడ్డతో చంపే రకం అని మండిపడ్డారు.

అధికారంలో ఉన్నపుడు పోలీసులు కేసులు పెట్టడం లేదని ధర్నాలకు దిగిన మంథని ఎమ్మెల్యే ఇప్పుడు అందరిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద తన కుటుంబ సభ్యులపై గతంలోనే రౌడీ షీట్ తెరిపించారని ఆరోపించారు. ఎమ్మెల్యే తమ్ముడికి భారీ పోలీసు రక్షణ ఉంటుందన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదులు తీసుకోవడం లేదని ఆరోపించారు. లత అనే మహిళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు పెడితే స్థానిక పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలన్నారు. లేదంటే మేము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. మంథని ఎమ్మెల్యే కుటుంబం ఆనాటి నుంచి మావోయిస్టుల పేరు మీద అమాయకులను చంపించిందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలపై మంథని ఎమ్మెల్యే చేస్తున్న దౌర్జన్యంపై మధిర ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.


Similar News