హైదరాబాద్ లో విశృంఖలంగా పబ్ కల్చర్

హైదరాబాద్ నగరం అంటేనే అన్ని మతాలకు, సంస్కృతి, సాంప్రదాయాలకు మారుపేరు.

Update: 2024-10-06 14:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరం అంటేనే అన్ని మతాలకు, సంస్కృతి, సాంప్రదాయాలకు మారుపేరు. అలాంటి నగరాన్ని కొంతకాలంగా పాశ్చాత్య విష సంస్కృతి కలుషితం చేస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబైకి మాత్రమే పరిమితమైన పబ్ కల్చర్ నగరంలో వేగంగా విస్తరిస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు నగర యువత పబ్బుల్లో వాలిపోయి, విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ.. అర్థనగ్న డాన్సులకు ఎగబడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పబ్ నిర్వాహకులు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. అమ్మాయిలతో డాన్సు షోలు ఏర్పాటు చేసి, తద్వారా ఎక్కువమందిని పబ్బులకు రప్పిస్తున్నారు. అక్కడికి వచ్చిన వారికి అమ్మాయిలతో వల వేయించి, అధికంగా డబ్బులు వసూలు చేసే దందాకు తెరలేపుతున్నారు. కొంతకాలం క్రితం కేబీఆర్ పార్క్ వద్దనున్న ఓ ప్రముఖ పబ్ లో ఇలాంటి ఘటన జరగగా.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కొత్త దందా గురించి సోషల్ మీడియాలో, వార్తల్లో వైరల్ అయింది. ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. తాజాగా జేఎన్టీయూ వద్ద గల మంజీర మాల్ లోని పబ్ లో ఇదే తరహా మోసం జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే గతంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు ఇప్పుడు మాత్రం తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి, ఊరుకున్నారని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేసేలా పబ్బుల మీద గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.  


Similar News