'ఏపీలో BRS పోటీ కోసమే విభజన సమస్యలపై KCR మౌనం'
ఓ వైపు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఏపీలో బీఆర్ఎస్ పోటీ కోసం సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని TJS అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వైపు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఏపీలో బీఆర్ఎస్ పోటీ కోసం సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని TJS అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. కృష్ణానదీ జలాల సమస్య పరిష్కారానికి 150 మందితో గంటపాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మౌనదీక్ష చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో బీఆర్ఎస్ పోటీ చేయాలనే రాష్ట్ర సమస్యలపై కేసీఆర్ పోరాటం చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లు గడుస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా తేల్చక పోవడంపై మండిపడ్డారు.
విభజన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయడం లేదని దాంతో కేంద్రం కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. కృష్ణా తీర ప్రాంతం 78 శాతం తెలంగాణలోనే ఉంది. కానీ రాష్ట్రానికి 299 టీఎంసీలు మాత్రమే కేటాయించడంపై కోదండరామ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వరద జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు నడుస్తున్నాయని అన్నారు. కేంద్రం ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల 28 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఆగిపోయిందని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేసీఆర్ పాలనపై సెమినార్ నిర్వహిస్తామన్నారు.