పవర్ కమిషన్ కేసులో అనుహ్య పరిణామం.. విచారణ జరుగుతుండగానే జస్టిస్ నర్సింహారెడ్డి కీలక ప్రకటన
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై ఎంక్వైరీకి జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో తెలంగాణ
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై ఎంక్వైరీకి జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్‌లో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. పవర్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పవర్ కమిషన్ విచారణ నుండి తప్పుకుంటున్నట్లు ఆయన లేఖ రాశారు. ఈ మేరకు లేఖను సుప్రీంకోర్టుకు పంపారు. విచారణ నుండి తప్పుకుంటున్నట్లు నర్సింహారెడ్డి పంపిన లేఖను న్యాయవాదులు సుప్రీంకోర్టుకు అందించారు. దీంతో పవర్ కమిషన్ చైర్మన్‌గా కొత్త వారిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు గడువు ఇచ్చింది.
పాత నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. సోమవారం లోపు పవర్ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను అపాయింట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. పవర్ కమిషన్ చైర్మన్ తొలగించి కొత్త వ్యక్తిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ పూర్తి కావడానికి ముందే కమిషన్ చైర్మన్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పవర్ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమించి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.