Ponnam Prabhakar: కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
ఇప్పటికైనా బీసీల గురించి మాట్లాడుతున్నందుకు సంతోషకరం అని మంత్రి పొన్నం సెటైర్ వేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా బీసీల గురించి మాట్లాడటం సంతోషకరం అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు గౌరవం దక్కలేదని అధికారంలో ఉండగా బీసీల గురించి మాట్లాడని బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతున్నారని పొన్నం మండిపడ్డారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అన్నారు. 50 శాతం రిజర్వేషన్స్ సీలింగ్ ను తొలగిస్తామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారని వీలైతే ఇందుకు కవిత రాజకీయంగా సహకరించాలన్నారు. అంతే తప్ప రాజకీయ లబ్ధికోసం బీసీలను ఉపయోగిస్తే బీసీలు చూస్తూ ఊరుకోరని కవితకు సూచిస్తున్నారన్నారు. గత పదేళ్లలో బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ముందు మీ పార్టీ పదవులు ఇచ్చి మాట్లాడాలి:
కాంగ్రెస్ (Congress) పార్టీలో బీసీలం అంతా మా హక్కుల కోసం గొంతెత్తి నిలదీయగలం ఇది మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ, మరి బీఆర్ఎస్ లో బీసీలకు ఎంత స్వేచ్ఛ ఉందని మంత్రి ప్రశ్నించారు. బీసీల (BRS) గురించి బీఆర్ఎస్ మొసలి కన్నీరు కార్చి బలహీన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయవద్దన్నారు. బీసీల గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ తొలుత సంస్థాగత పదవువుల్లో బీసీలను అవకాశం ఇచ్చిన తర్వాతే మాట్లాడాలన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీసీలకు అవకాశం ఇవ్వని బీఆర్ఎస్ ఎదుటివారిని మాత్రం ప్రశ్నిస్తోందని ఇదేం న్యాయం అన్నారు. బలహీన వర్గాలు బీఆర్ఎస్ వలలో పడే చాన్స్ లేదన్నారు. రైతుభరోసా ఇవ్వడానికి మంత్రి వర్గ ఉపసంఘం మోదం తెలిపింది. కానీ తాము అడిగితేనే ఇచ్చారు అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ రైతు భరోసాపై అబద్దాలు చెబుతోందన్నారు. రైతుల పట్ల మాకు ప్రేమ ఉందని రైతు భరోసా అమలు చేయబోతున్నామన్నారు.