రామోజీరావు మరణంపై రాజకీయం.. స్టార్ హీరో వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం
రామోజీరావు మరణంపై రాజకీయ దుమారం చెలరేగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఈనాడు గ్రూప్స్ సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలుగు జర్నలిజం, వినోద రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుని పలువురు ప్రముఖులు రామోజీరావు కృషిని కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే రామోజీరావు మరణంపై ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. రామోజీరావు పార్థివ దేహానికి నివాళి అర్పించిన రాజేంద్రప్రసాద్ అనంతరం మాట్లాడుతూ రామోజీరావు నీచ రాజకీయాల వల్ల అవమానాలు అనుభవించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కానీ ఒకటి మాత్రం నిజం.. ఆయనను వేధించిన వారి పతనం చూశాకే ఆయన దైవ సన్నిధికి వెళ్లారు అంటూ రాజేంద్ర ప్రసాద్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గత జగన్ ప్రభుత్వ హయాంలో మార్గదర్శి చిట్స్ ఫండ్ కేసులో సీఐడీ దర్యాప్తు చేసింది. ఈ సమయంలో రామోజీరావు అనారోగ్యంతో బెడ్ పై పడుకున్న సమయంలోనూ అధికారులు దర్యాప్తు పేరుతో వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో రామోజీరావును వేధించారని కామెంట్స్ చేస్తున్నారు. అలా రామోజీరావు మరణంపై రాజకీయ కామెంట్స్ రావడం సామాజిక మాధ్యమాల్లో దుమారం గా మారింది.