రేపటితో ముగియనున్న ఆషాఢం..స్టేట్‌లో మరింత పెరగనున్న పొలిటికల్ హీట్
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయా పార్టీలు ఇప్పటి వరకు వెనకడుగు వేశాయి. ఆషాఢమాసం కావడంతో పలు ప్రోగ్రామ్స్ వాయిదా వేస్తూ వచ్చాయి. మంగళవారంతో ఆషాఢం ముగుస్తుండటంతో ఆయా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. సరికొత్త పొలిటికల్ వ్యూహాలతో రంగంలోకి దిగాలనుకుంటున్నారు.
ఇప్పటికే మాటలతో పొలిటికల్ పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్నది. ఇక ఫీల్డ్ మీదకు వెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు స్కెచ్ వేసుకుంటున్నారు. ఎన్నికలకు ఐదు నెలలే మిగిలి ఉన్నందున మూడు ప్రధాన పార్టీలు ముమ్మర వ్యూహాల్లో బిజీ అయిపోయాయి. వివిధ పార్టీల్లోని పలువురు నేతలు వేర్వేరు కారణాలతో ఇతర పార్టీల్లోకి వెళ్లేలని నిర్ణయించుకున్నారు. సంప్రదింపుల ప్రక్రియ ముగిసినా మంచి రోజుల కోసం వెయిట్ చేశారు. ఆషాఢం నెగెటివ్ సెంటిమెంట్‌తో నిర్ణయం తీసుకోలేకపోయారు.
ఇక ఆ మాసం ముగుస్తుండటంతో పూజారులను కలిసి మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని వలస వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం రెగ్యులర్‌గా వచ్చే శ్రావణ మాసానికి ముందే ‘అధిక శ్రావణం’ వస్తున్నది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయో లేవో తేల్చుకుని జంప్ కావడంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు టికెట్ సంగతి తేలినా తేలకున్నా క్షేత్రస్థాయిలో ప్రచారానికి సైతం మంచి రోజును ఎంచుకోవాలని మరి కొందరు నేతలు భావిస్తున్నారు.
బిజీ బిజీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పలు జిల్లాల్లోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు అక్కడి పార్టీ ఆఫీసులనూ ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 24న సూర్యాపేట టూర్ ప్లాన్ చేశారు. ఇంకోవైపు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పర్యటనలు ప్రాథమికంగా ఫిక్స్ అయ్యాయి. తేదీలను ఖరారు చేయడమే మిగిలింది. రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి షెడ్యూలు రూపొందించే పనులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్కు కరీంనగర్ జిల్లా నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం ఆనవాయితీ. ఈసారి ఎక్కడి నుంచి ప్రచారానికి శ్రీకారం చుడతారనేది ఆసక్తికరంగా మారింది. చాలా నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌లు, ఆశావహులు కేసీఆర్ పాల్గొనేలా బహిరంగ సభలపై ఫోకస్ పెట్టారు.
ఆషాఢం ముగిసిపోతుండడంతో ఏ తీరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేయడంలో బిజీ అయిపోయారు. ప్రచారంలో వాడే వాహనాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు ప్రస్తావించాల్సిన అంశాలు, విపక్షాలపై విమర్శలు, కొత్తగా ఇవ్వాల్సిన హామీలు, ఇప్పటివరకు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల చిట్టా.. తదితరాలతో సిద్ధమవుతున్నారు. వారి ఇష్టదైవంగా ఉండే ఆలయాన్ని సందర్శించి ప్రచారంలోకి దూకాలని భావిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులకే టికెట్లు దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అలాంటి కాన్ఫిడెన్సు ఉన్న నేతలంతా నియోజకవర్గాల్లో ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. అనుమానం ఉన్న నేతలు ఏం చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టుపై స్పెస్పెన్స్
ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో స్పష్టం చేశారు. ఆషాఢ మాసం కావడంతో లిస్టు రాకపోవచ్చని చాలా మంది సిట్టింగ్‌లు ఎవరికి వారు సర్దిచెప్పుకున్నారు. టికెట్ వస్తుందో రాదోననే ఉత్కంఠ పలువురిని ఇంతకాలం కలవరపెట్టింది. ఇప్పుడు ఆషాఢ మాసం ముగుస్తుండడంతో ఈ నెల 18 తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ లిస్టు రిలీజ్ అయ్యే అవకాశముందనే నమ్మకంతో ఉన్నారు. సుమారు 70 మంది అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితాను తెలంగాణ భవన్లో కేసీఆర్ రిలీజ్ చేసే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత లేని సిట్టింగులతో పాటు కచ్చితంగా గెలుస్తారనే భరోసా ఉన్నవారితో ఫస్ట్ లిస్టును ప్రకటించే చాన్స్ ఉన్నది.
బీఆర్ఎస్ లిస్టు విడుదలైన తర్వాతనే అభ్యర్థులపై ఒక స్పష్టతకు రావాలని కాంగ్రెస్ ఎదురుచూస్తున్నది. బీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించినా జాబితాలో చోట దక్కని నేతలు తమవైపు వస్తారనే ఆశతో ఉన్నది. గత ఎన్నికల తరహాలో చివరి నిమిషం వరకూ లిస్టును పెండింగ్‌లో పెట్టకుండా ముందుగానే ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్లు పలువురు ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో సెప్టెంబరు 17న సోనియాగాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టోను రిలీజ్ చేయించి ఆ తర్వాత అభ్యర్థుల పేర్లను ప్రకటించే చాన్స్ ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. బీజేపీ సైతం ఇతర పార్టీల నుంచి అసంతృప్తులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే సొంత పార్టీ నుంచి ఎవ్వరూ చేజారిపోకుండా డిఫెన్స్ వ్యూహాన్నీ రూపొందించుకున్నది.