వైరాలో రాజకీయ వేడి.. సీపీఐకి షాక్ ఇచ్చిన విజయబాయి!
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటంతో వైరాలో రాజకీయ వేడి మొదలైంది.
దిశ, వైరా: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటంతో వైరా నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. పొంగులేటి పార్టీ మారటం ఖాయం కావడంతో వైరా నియోజకవర్గంలో కూడా రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో వైరా నుంచి సీపీఐ అభ్యర్థినిగా పోటీ చేసి ఓటమి చెందిన భానోత్ విజయబాయి పొంగులేటి వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఆమె పలుసార్లు పొంగులేటిని కలిసి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
విజయబాయి ఈ నిర్ణయం తీసుకొని సీపీఐ పార్టీకి షాక్ ఇచ్చింది. ఇదే విషయమై ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి వైరా నియోజకవర్గంలోని తన అనుచరులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలాల వారీగా నాయకుల అభిప్రాయాలను పొంగులేటి సేకరించారు. జూలూరుపాడు, ఏన్కూరు మండలాల నుంచి పదిమంది చొప్పున, కారేపల్లి, కొనిజర్ల మండలం నుంచి 20 మంది చొప్పున నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైరా మండలం నుంచి ముగ్గురు ముఖ్య నాయకులు మాత్రమే ఈ అభిప్రాయ సేకరణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పొంగులేటి తన తరుపున వైరా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ముగ్గురు నేతల పేర్లను నాయకులకు తెలిపి వారి నుంచి అభిప్రాయం సేకరించారు. ఈ ముగ్గురిలో ఎవరైతే మన అభ్యర్థిగా బాగుంటుందని పొంగులేటి వివరాలు సేకరించారు. వైరా నియోజకవర్గంలోని మెజార్టీ నాయకులు భానోత్ విజయబాయి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారని సమాచారం. దీంతో పొంగులేటి విజయబాయిని వైరా నుంచి తన అభ్యర్థిగా రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు.
గత సాధారణ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న విజయబాయి ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు బీఆర్ఎస్‌తో కలిసి నడుస్తున్న సీపీఐ పార్టీకి వచ్చే సాధారణ ఎన్నికల్లో వైరా సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. సీపీఐకి సీటు కేటాయిస్తే ఆ పార్టీ నుంచి విజయబాయి పోటీలో ఉంటారని ఇటీవల వరకు సీపీఐ శ్రేణులు ప్రచారం చేశారు. చివరకు విజయబాయి సీపీఐను వదిలి పొంగులేటి మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావడం విశేషం. మరోవైపు సీపీఐ వచ్చే సాధారణ ఎన్నికల కోసం మరో అభ్యర్థిని అన్వేషించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
నష్ట నివారణ చర్యలపై ఫోకస్
ఇప్పటివరకు తనతో ఉన్న పొంగులేటి వర్గీయులు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా చూసేందుకు నష్ట నివారణ చర్యలపై వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ప్రతి మండలంలో జరిగే సభల్లో సభా వేదికపై ఉన్న పొంగులేటి వర్గీయులను ఉద్దేశించి ఇప్పటివరకు అందరం కలిసి ఉన్నాం. భవిష్యత్తులో కూడా అందరం కలిసి నడుద్దాం అంటూ తన మనసులో మాటలను బయట పెడుతున్నారు. అంతేకాకుండా పొంగులేటి వర్గీయులతో వ్యక్తిగతంగా మాట్లాడి కన్విన్స్ చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.
ఇప్పటివరకు తన వెంట ఉండటం వల్ల కలిగిన లాభాలను వారికి వివరిస్తున్నారు. అదేవిధంగా పార్టీ నుంచి బయటికి వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందని పొంగులేటి వర్గీయులకు చెప్పి సముదాయిస్తున్నారు. ప్రధాన నేతలు పొంగులేటితో బయటకు వెళ్లినా పార్టీలో కీలకంగా వున్న బీజేపీ పార్టీని వ్యతిరేకించే సామాజిక వర్గ నేతలు బీఆర్ఎస్‌ను వీడకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.
వేచి చూసే ధోరణిలో పొంగులేటి వర్గీయులు
వైరా నియోజకవర్గంలోని పొంగులేటి వర్గీయుల్లో అత్యధిక మంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ప్రస్తుతం మాత్రం వారు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు పలు కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి కనీస బలం లేదు. అలాంటి పార్టీలో పొంగులేటి చేరితే రాజకీయంగా తమకు భవిష్యత్తు ఉంటుందా.. ఉండదా అనే విషయమై తర్జనభజన పడుతున్నారు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్ వెంట నడుస్తున్న పొంగులేటి వర్గీయులే అత్యధికమంది ప్రజా ప్రతినిధులుగా, నామినేటెడ్ పదవుల్లో వున్నారు.
పదవుల్లో ఉన్న వారంతా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీ మార్పుపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా వైరా మండలంలో ఈ సమస్య అధికంగా ఉంది. బీజేపీ పార్టీ అంటేనే వైరా మండలంలోని అత్యధిక మంది పొంగులేటి వర్గీయులకు రుచించడం లేదు. చివరి వరకు వేచి చూసి తప్పదనుకున్న పరిస్థితుల్లో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుందామని ఆలోచనలో చాలామంది ఉన్నారు.
సీపీఐని వదిలిన కీలక మహిళా నేతలు
వైరా నియోజకవర్గంలో సీపీఐ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అప్పట్లో విద్యావంతురాలైన భానోత్ చంద్రావతిని ఎన్నికల బరిలో సీపీఐ నిలిపింది. ఆ ఎన్నికల్లో చంద్రావతి విజయం సాధించింది. అయితే ఎమ్మెల్యేగా చంద్రావతి పనితీరుపై సీపీఐలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీపీఐ పార్టీ నాయకులు ఆమెపై ఆరోపణలు చేయటంతో 2014 ఎన్నికల్లో చంద్రావతికి సీపీఐ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో చంద్రావతి అప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరి వైరా నుంచి పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో సీపీఐ నారాయణను ఎన్నికల బరిలో దింపింది. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విజయం సాధించారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి పదవిని అనుభవించిన చంద్రావతి 2014లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ తరపున పోటీ చేయటంతో సీపీఐకి మొదటి దెబ్బ తగిలింది. 2018 ఎన్నికల్లో విజయబాయిని సీపీఐ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపినా.. ఆర్థిక కారణాల వల్ల ఆమె ఓటమి చెందారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం విజయబాయి కూడా సీపీఐ పార్టీకి హ్యాండ్ ఇవ్వటంతో ఆ పార్టీకి ఇద్దరు కీలక మహిళా నేతలు దూరం అయినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read...