Daughter's emotions : తప్పిపోయిన ఆరేండ్లకు దొరికిన కన్నతండ్రి..కూతుర్ల భావోద్వేగం
తప్పిపోయిన ఆరేండ్లకు తిరిగి తమ కన్నతండ్రి(Missing father) తమకు దొరకడంతో ఆ కూతుర్ల భావోద్వేగానికి(Daughter's emotions)హద్దులు లేకుండా పోయింది.
దిశ, వెబ్ డెస్క్ : తప్పిపోయిన ఆరేండ్లకు తిరిగి తమ కన్నతండ్రి(Missing father) తమకు దొరకడంతో ఆ కూతుర్ల భావోద్వేగానికి(Daughter's emotions)హద్దులు లేకుండా పోయింది. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయిన బాలయ్య అనే వ్యక్తి జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం చేరదీసింది. గత నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించింది. ఈ సందర్భంగా తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడని ఆశ్రమ నిర్వాహకులకు చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్ళీ బాలయ్య కూతుర్లు అన్నదానం నిర్వహణకు ఆశ్రమానికి వచ్చారు.
ఆశ్రమంలో ఉన్నటువంటి 130 మందిలో తమ కన్నతండ్రిని గుర్తుపట్టిన కూతుర్లు ఇద్దరు కూడా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నతండ్రిని గట్టిగా హత్తుకుని ఆనంద బాష్పాలు కార్చారు. ఈ భావోద్వేగ దృశ్యం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమ తండ్రిని ఇంతకాలం వారు ఎంతగా మిస్ అయ్యారోనన్న వేదన..తిరిగి అతను తమకు దొరికాడాన్న సంతోషం వారిలో వ్యక్తమైంది. ఇంతకాలం తమ తండ్రి కోసం ఎంతో వెతికామని, విధి చివరకు ఈ రకంగా మమ్మల్ని కలిపిందని ఆ కూతుర్లు తండ్రిని పట్టుకుని సంబర పడ్డారు. బాగున్నావా తాతయ్య అంటూ బాలయ్య మనుమండ్లు తమ తాతను ఆప్యాయంగా పలకరించారు. నాన్న, తాతల పిలుపుతో ఇంతకాలం అనాధగా బతికిన బాలయ్య మనస్సు చలించింది. ఆశ్రమ నిర్వహకుల అనుమతితో తమ తండ్రిని ఆ కూతుర్లు ఇద్దరు పట్టలేని ఆనందోత్సహంతో ఇంటికి తీసుకెళ్లిపోయారు.