Group 3 పరీక్షలో కులాలపై ప్రశ్న.. TGPSC క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ ఫైర్

తెలంగాణ వ్యాప్తంగా సోమ, మంగళ వారాల్లో గ్రూప్ 3 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 3 లక్షల మంది వరకు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.

Update: 2024-11-19 07:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా సోమ, మంగళ వారాల్లో గ్రూప్ 3 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 3 లక్షల మంది వరకు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. పరీక్షలు ప్రశాతంగా పూర్తయ్యాయి. అయితే తాజాగా ఈ పరీక్షల్లో అడిగిన ఓ ప్రశ్నపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలో కులాల ప్రస్తావన ఉండడన్ని వ్యతిరేకించిన సదరు నేతలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు అడగడం సిగ్గు చేటని మండిపడ్డారు. దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరీక్ష పత్రం ఫోటోను షేర్ చేయగా.. దాన్ని కేటీఆర్ రీపోస్ట్ చేశారు.

కాగా.. ప్రవీణ్ కుమార్ షేర్ చేసిన ప్రశ్నా పత్రం ఫోటోలో ‘భారతదేశంలో సంస్కృతీకరణపై కింది ప్రకటనలో ఏవి సరైనవి?’ అని ప్రశ్న అడిగి దానికి ‘A) తక్కువ కులానికి చెందిన సభ్యులు తమ పద్ధతులు మరియు ఆచారాలను సమిష్టిగా మార్చుకునే ప్రక్రియను ఇది సూచిస్తుంది. B) ఈ ప్రక్రియలో భాగంగా తక్కువ కులానికి చెందిన సభ్యులు ఉన్నత కులం యోక్క జీవన విధానాలను సమిష్టిగా అనుకరిస్తారు. C) సంస్కృతీకరణ ద్వారా తక్కువ కులానికి చెందిన సభ్యులు కుల వ్యవస్థ నుండి సమిస్టిగా బయటకు రావడానికి ప్రయత్నిస్తారు.’ మూడు ఆప్షన్స్ ఇచ్చారు.

ఈ ప్రశ్న అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ‘టీజీపీఎస్‌సీ గ్రూప్‌-3లో కులవ్యవస్థను ప్రోత్సహించే ప్రశ్న రావడం ఏంటి..? ఇది చూస్తుంటే స్వాతంత్ర్యానంతరం అమృతకాలంలోకి ప్రవేశించినా భారతదేశంలో ఇప్పటికీ కులాల్లో ఎక్కువ, తక్కువలు ఉన్నాయనడంలో సందేహం లేదు. High caste, Low caste, తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇంక సామాజిక న్యాయం ఎట్ల వస్తది రేవంత్ రెడ్డి గారూ? మీ సమీకృత విద్యా విధానం చిలుక పలుకులు కేవలం వట్టి మాటలే, నీటి మూటలే’ అంటూ తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

ఇదే పోస్ట్‌ను కేటీఆర్ కూడా రీట్వీట్ చేస్తూ.. ‘ఇలాంటి కులవ్యవస్థను ప్రోత్సహించే ఎజెండాను ప్రోత్సహిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిజంగా సిగ్గుపడాలి, తల దించుకోవాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.


Similar News