Kalvakuntla Kavitha: 'మహిళా రిజర్వేషన్' క్రెడిట్ ఎవరికి..? కవిత లేఖతోనే కదలిక వచ్చిందా..?
మహిళా బిల్లు కోసం మూడు దశాబ్దాలుగా అనేక పార్టీలు చొరవ తీసుకున్నాయి. బిల్లు
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా బిల్లు కోసం మూడు దశాబ్దాలుగా అనేక పార్టీలు చొరవ తీసుకున్నాయి. బిల్లు పెట్టాలంటూ అధికారంలో ఉన్న పార్టీలపై ఒత్తిడి చేశాయి. బిల్లు పెట్టిన తర్వాత కొన్ని పార్టీలు అనుకూలంగా, మరికొన్ని పార్టీలు ప్రతికూలంగా చర్చల్లో అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. బిల్లులో ఓబీసీ కోటా పెట్టాలని సవరణలను డిమాండ్ చేశాయి. 30 ఏండ్లుగా పార్లమెంటు ఉభయ సభల్లో ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు ప్రత్యేక సెషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశ పెట్టడంతో అది మా క్రెడిట్.. కాదు మాదే.. అంటూ పరస్పరం క్లెయిమ్ చేసుకోడానికి పోటీ పడుతున్నాయి. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆ రేసులో యాక్టివ్ అయ్యాయి.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్‌లో మహిళా ఓటర్లలో మైలేజ్ పొందడానికి, వారి ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. కేంద్రం మెడలు వంచింది మేమంటే.. మేము.. అని వాదించుకుంటున్నాయి. ప్రజల్లో ఎంత బలంగా చెప్పుకుంటే అంతగా చర్చనీయాంశమై ఓట్లు రాలుస్తాయన్నది ఆ పార్టీల అభిప్రాయం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య ఈ వాదనలు వినిపిస్తున్నాయి. పాత బిల్లునే తీసుకొచ్చి హడావిడి చేస్తున్నాయని కొన్ని పార్టీలు వ్యాఖ్యానిస్తూ ఉంటే.. ఆ బిల్లుతో సంబంధమే లేదని.. ఇది కొత్త బిల్లు అని బీజేపీ వివరణ ఇచ్చుకుంటున్నది. క్రెడిట్ కోసం ఈ పార్టీలు ఎంతగా క్లెయిమ్ చేసుకున్నా అమల్లోకి వచ్చేది ఎప్పటి నుంచి అనే దానికి స్పష్టత కరువైంది.
ఆ బిల్లు మాదే: సోనియాగాంధీ
యూపీఏ హయాంలో రాజ్యసభలో 2010లోనే ఈ బిల్లు ఆమోదం పొందిందని, లోక్‌సభలో కొన్ని పార్టీలు అడ్డం పడి పాస్ కాకుండా చేశాయన్నది కాంగ్రెస్ వాదన. చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలోనూ ఆ చొరవ తీసుకునేదని బీజేపీ ఎంపీలు కామెంట్ చేశారు. ఇలాంటి పరస్పర విమర్శల నేపథ్యంలో మంగళవారం పార్లమెంటు పాత భవనంలో గ్రూపు ఫొటో కోసం వచ్చిన సోనియాగాంధీ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పాత్రికేయులు ప్రస్తావించారు. దీనిపై ఆమె స్పందిస్తూ... ‘ఈ బిల్లు మాదే... అప్నా హై..’ అంటూ ముక్తసరిగా బదులిచ్చి కాంగ్రెస్ చొరవను బీజేపీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం దీన్ని రాజ్యసభలో పాస్ చేయకపోతే ఇప్పుడు బీజేపీ చొరవ తీసుకునేదే కాదన్న వ్యాఖ్యలూ కాంగ్రెస్ ఎంపీల నుంచి వినిపించాయి.
ఇది పూర్తిగా కొత్త బిల్లు: కేంద్ర మంత్రి
యూపీఏ హయాంలో రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు.. ఇప్పుడు లోక్‌సభలో తాము ప్రవేశ పెడుతున్న బిల్లుకు సంబంధమే లేదని కేంద్ర న్యాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం లోక్‌సభలోనే కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి కౌంటర్‌గా బదులిచ్చారు. అప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు ఎప్పుడో కాలం చెల్లిందిగా అటకెక్కిందని, ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నదని వివరించారు. దీంతో చౌదరి సంతృప్తి చెందక పోవడంతో ఆనాడు రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు ఇప్పటికీ లైవ్‌లో ఉందని నిరూపించే ఎవిడెన్సును సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. పాత బిల్లుతో సంబంధం లేనందు వల్లనే ఇప్పుడు లోక్‌సభలో పెట్టి గురువారం మళ్లీ రాజ్యసభలో పెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి క్లారిటీ ఇచ్చారు.
కవిత లేఖతోనే కదలిక
కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య క్రెడిట్ పొందడానికి జరిగే ప్రయత్నాలు అలా ఉంటే వాటన్నింటికంటే ఎమ్మెల్సీ కవిత తీసుకున్న చొరవతోనే ఇప్పుడు పార్లమెంటులో చర్చకు వచ్చిందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో మహిళా బిల్లు చర్చకు వచ్చే అవకాశముందనే వార్తలు ఈ నెల మొదటి వారంలోనే వినిపించాయి. ప్రధాని మోడీ సహా మొత్తం 47 పార్టీల నేతలకు ఎమ్మెల్సీ కవిత ఈ నెల ఫస్ట్ వీక్‌లో లేఖలు రాశారు. బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా రిక్వెస్టు చేశారు. దీన్నే ప్రస్తావించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఎమ్మెల్సీ కవిత లేఖతోనే కేంద్రంలో కదలిక వచ్చిందని, ఆ ఒత్తిడితోనే బీజేపీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సి వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు.
మహిళా రిజర్వేషన్‌ను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఈ ఏడాది మార్చి 10న దీక్ష చేసిన కవితకు పలు పార్టీలు మద్దతు పలికాయని, ఆ దీక్షలో పాల్గొని సంపూర్ణ సహకారం అందించారని బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సైతం కవిత చొరవ, ఒత్తిడి, పోరాటం ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఎప్పటినుంచి అమల్లోకి ?
ఏ పార్టీ ఎంతగా గొప్పగా ప్రకటించుకున్నా చివరకు ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశంలో క్లారిటీ లేదు. అన్ని పార్టీలూ మహిళా బిల్లు విషయాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, మహిళా ఓటర్లను ఆకర్షించడానికి చేస్తున్న ఎలక్షన్ స్టంట్‌గానే మారింది. ఏ పార్టీ ఎంత ఎక్కువగా మైలేజ్ పొందాలనే అంశానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది.