వాటికి చివరి ముహూర్తం అదే.. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో పంచాగ శ్రవణం
తెలుగు నూతన శ్రీ క్రోధి సంవత్సరంలో వ్యక్తిగత గొడవలు జరిగిన సుస్థిర ప్రభుత్వం ఉంటుందని జ్యోతీష్యుడు కావూరి సూర్యనారాయణ మూర్తి వెల్లడించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు నూతన శ్రీ క్రోధి సంవత్సరంలో వ్యక్తిగత గొడవలు జరిగిన సుస్థిర ప్రభుత్వం ఉంటుందని జ్యోతీష్యుడు కావూరి సూర్యనారాయణ మూర్తి వెల్లడించారు. మంగళవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ స్టేట్ ఆఫీసులో సంబరాలను నిర్వహించిన తర్వాత ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్బంగా జ్యోతిష్యుడు కావూరి సూర్యనారాయణ పంచాంగ శ్రవణం చేస్తూ భవిష్యత్తు గురించి వివరించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి గురువు అనుగ్రహం ఉంటుందన్నారు. కానీ శ్రీ క్రోధ సంవత్సరం వ్యాపార వర్గాల వారికి నష్టం కల్గించేలా ఉంటుందని, ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది పంటలకు తగిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెల్లటి పంటలు బాగా పండుతాయని, ఆహార ధాన్యాల ధరలు నిలకడగా ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 23తో పెళ్లిళ్లు ముగుస్తాయని, అదే రోజు పెళ్లిళ్లకు చివరి ముహూర్తమంటూ ఆయన వ్యాఖ్యానించారు. దేశీయ పరంగా వృత్తులు పెరుగుతూ, దానికి అనుగుణంగా వృద్ధిరేటు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. భా అంటే కాంతి.. అందుకే ఇది భారతదేశం కాంతివంతమైన దేశంగా అని పిలవబడుతుందన్నారు. వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా ప్రేమలు పెరుగుతాయని వివరించారు. ఈ ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని వెల్లడించారు. మకర, ధనస్సు, కుంభ రాశుల వారికి ఉన్నత స్థాయిలో పదవులు దక్కే అవకాశాలున్నాయని తెలిపారు. కర్కాటక, సింహ, వృశ్చిక రాశుల వారికి అష్టమ శని నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌లు పాల్గొన్నారు .