KTR: అధికారులు వద్దన్నా.. ఎందుకు చెల్లించారు? కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం
ఏసీబీ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ
దిశ, డైనమిక్ బ్యూరో : ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో (Formula-E car race case) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏసీబీ (ACB) ఆఫీస్‌లో ఇవాళ విచారణకు హాజరయ్యారు. జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఆయనను విచారిస్తున్నారు. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ వెంట ఆయన లాయర్ రామచందర్‌రావు సైతం హాజరయ్యారు. విచారణ గదిలో సీసీటీవీ ఫుటేజ్‌ను, లైబ్రరీ గదిలో కూర్చుని చూసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు దానకిశోర్, ఏ2 నిందితుడు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలాలు, హైదరాబాద్, మచిలీపట్నంలోని గ్రీన్ కో, అనుబంధ సంస్థల్లో నిర్వహించిన సోదాలతోపాటు తాము సేకరించిన ఆధారాలపై కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఒప్పందాలు, చెల్లింపులు అన్నీ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని నిన్నటి ఏసీబీ విచారణలో అప్పటి మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్‌గా వ్యవహరించిన అరవింద్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనలు, చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ముందే చెప్పినా ఎందుకు ప్రొసీడ్ కావాలని ఒత్తిడి చేశారు? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆర్‌బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎందుకు చేశారు? ఎన్నికల కోడ్ టైమ్‌లో నిధుల ట్రాన్స్‌ఫర్ ఎందుకు? ముఖ్యంగా ఎఫ్ఈఓకు రూ. 55 కోట్ల బదిలీపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కోసం మొత్తం 35 ప్రశ్నలను సిద్ధం చేసిన ఏసీబీ వాటిని మాజీ మంత్రి ముందు ఉంచి ఇంటరాగేషన్ చేస్తున్నట్లు సమాచారం.
ఏం చేసినా తెలంగాణ ప్రతిష్ట కోసమే చేశా : కేటీఆర్
ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణలో ఎలాంటి క్విడ్‌ప్రోకోకు పాల్పడలేదని కేటీఆర్ అన్నారు. ఇవాళ విచారణ కోసం ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లేముందు ఆయన నందినగర్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ సైనికుడినని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ బావమరుదులకు కోట్ల కాంట్రాక్టులు ఇవ్వలేదని, కేబినెట్‌లో కూర్చొని ఏకంగా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదని, దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదని చెప్పుకొచ్చారు. తాను రూ. 50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి అడ్డంగా దొరికిపోయిన దొంగను కాదని పేర్కొన్నారు. ఇలాంటి తెలివితేటలు సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రి మండలికే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే తాను ఫార్ములా ఈ-రేసును నిర్వహించానని స్పష్టం చేశారు. అవసరం అయితే చస్తానని.. అవినీతి పనులు మాత్రం చేయనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసు పెట్టారని, అయితే ఏం జరిగినా శాంతియుతంగానే నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
మరోవైపు ఫార్ములా ఈ -కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అత్యవసరంగా విచారణ జరపాలని, రేపు విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరఫున న్యాయవాది కోరగా ఇందుకు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని స్పష్టం చేసింది.
అరవింద్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ..
ఇదే కేసులో ఈడీ ఎదుట ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (Arvind Kumar) విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. నిన్న బీఎల్ఎన్‌రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ -ఆపరేషన్స్ సంస్థకు రూ.45 కోట్ల బదిలీపై అధికారులు ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో అదే కోణంలో ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం.
హరీశ్‌రావు హౌస్ అరెస్టు...
కేటీఆర్ విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును (Harish Rao) పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గండిపేట్‌లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే అక్కడికి పార్టీ శ్రేణులు, అభిమానులు చేరుకుంటున్నారు.