హైడ్రా వల్ల నిద్ర లేదు: మాజీమంత్రి మల్లారెడ్డి

హైడ్రా వల్ల ప్రశాంతత లేదు.. నిద్ర లేదని మాజీమంత్రి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు

Update: 2024-09-25 12:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా వల్ల ప్రశాంతత లేదు.. నిద్ర లేదని మాజీమంత్రి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా నుంచి నా విద్యా సంస్థలకు నోటీసులు వచ్చాయని దీంతో ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందోనని ఆందోళన పడాల్సివస్తుందన్నారు. యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో నిర్మించానని..ఇప్పుడు నోటీసులివ్వడం సరైంది కాదన్నారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్ల మీద పడేయడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. తెలంగాణలో హైడ్రా ప్రజలను హైరానాకు గురి చేస్తోందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రాను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఇళ్లను కూల్చివేసి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏదో యుద్ధం చేసినట్లుగా ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు.కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను ఓ సవాల్ చేస్తున్నానని, కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్లకు పాలాభిషేకం చేస్తానన్నారు. రేవంత్ పాలనలో రైతు భరోసా లేదని, రుణమాఫీ పూర్తి కాలేదన్నారు. మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సహజమేనన్నారు.

కాగా ఓవైసీ, మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిల కాలేజీల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. వారికి కొంత సమయం ఇస్తామని చెప్పారు. అయినప్పటికి రాజకీయాల నేపథ్యంలో ప్రభుత్వం కూల్చివేతలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. 


Similar News