PCC chief: నాలుగైదు రోజుల్లో కులగణన మార్గదర్శకాలు.. పీసీసీ చీఫ్ సెన్సేషనల్ కామెంట్స్
కులగణన విషయంలో మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : బీసీల కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన చేసి తీరుతామని పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేశ చరిత్రలో బీసీల కులగణన గురించి ఇంత ధైర్యంగా మాట్లాడింది రాహుల్ గాంధీ మాత్రమేనని, ఈ విషయంలో రాహుల్ గాంధీ ఓ చాంపియన్ అని అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు రావాల్సిన వాటా, వారికి దక్కాల్సిన గౌరవంలో ఎక్కడా కాంప్రమైజ్ ఉండదని, ఇది తన మాట, కాంగ్రెస్ మాట అని పేర్కొన్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో కులగణనకు సంబంధించిన విధివిధానాలు ఖరారై ఈ ప్రక్రియ ముందుకు వెళ్తుందన్నారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని బీసీ నాయకులు చెబితే వారితో తాను మాట్లాడానని, కులగణన అల్రెడీ ప్రాసెస్‌లో ఉందని, డిస్ట్రబ్ చేయొద్దని సూచించానని తెలిపారు. అనుమానం ఉంటే ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని తానే స్వయంగా వచ్చి ప్రభుత్వ ఆలోచనను మీ ముందుపెడతానని చెప్పానని అన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాయమాటలు..
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌వి అన్నీ మాయమాటలు తప్ప వారికి బీసీల పట్ల ప్రేమ లేదని మహేశ్ గౌడ్ విమర్శించారు. రాహుల్ గాంధీకి భయపడే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు అనుకూలం అని అంటున్నాయన్నారు. బీసీలంతా కాంగ్రెస్ వైపు వెళ్తారనే భయంతోనే అవసరానికి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. తనకు సన్మాన కార్యక్రమం అన్నారని, కానీ సంపూర్ణ కులగణన జరిగి ఎన్నికలకు వెళ్లినప్పుడు తనతోపాటు సీఎం రేవంత్‌రెడ్డిని సన్మానించుకుందామని మహేశ్ అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కులగణన చేయాలని ఎన్నికలకు ముందే నిర్ణయించామన్నారు. ఎన్నికలు జరగకపోతే స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు రావని అందువల్ల అధికార యంత్రాంగం నుంచి ఎన్నికలకు వెళ్లాలనే ఒత్తిడి ఉందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కులగణన బిల్లును తీసుకువచ్చిందని, కులగణన జరగకుండా రాష్ట్రంలో ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు.
దయనీయ స్థితికి కేసీఆరే కారణం..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉందని, దీనికి కేసీఆరే కారణం అని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణను కాళేశ్వరం లాంటి ఎందుకు పనికిరాని ప్రాజెక్టులతో దుబారా ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. ఒక ఎకరానికి నీళ్లు పారించాలంటే రూ. 45-50 వేలు ఖర్చు అయ్యే ప్రాజెక్టు అవసరమా అని ప్రశ్నించారు.