నష్టపరిహారం ప్రకటిస్తారా... ఇక్కడే చావమంటారా

వడగండ్ల వానతో పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం ప్రకటిస్తుందా... లేదా..? లేదంటే ఇక్కడే చావమంటారా... లేక పంట దెబ్బతిన్న పొలాల వద్ద పురుగుల మందు తాగి చావమంటారా అంటూ... ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత రైతులు హైవే పై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

Update: 2024-03-19 09:48 GMT

దిశ, భిక్కనూరు : వడగండ్ల వానతో పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం ప్రకటిస్తుందా... లేదా..? లేదంటే ఇక్కడే చావమంటారా... లేక పంట దెబ్బతిన్న పొలాల వద్ద పురుగుల మందు తాగి చావమంటారా అంటూ... ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత రైతులు హైవే పై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివారులోని జియో పెట్రోల్ బంక్ ఎదుట ఉన్న హైవేపై మంగళవారం బైఠాయించి గంటన్నర పాటు హైవేను దిగ్భందించడంతో హైవేకి ఇరుపక్కల వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... నాలుగు రోజుల క్రితం కురిసిన వడగళ్ల వానతో ఆరుగాలం శ్రమించి పండించిన వేల ఎకరాల్లో సాగు చేసిన వరి, మక్కజొన్న పంటలతోపాటు, బొప్పాయి, జామ, కర్బూజా వివిధ రకాల కూరగాయలు చేతికొచ్చే వీలు లేకుండా దెబ్బతిన్నాయి.

    నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు వచ్చి గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయకపోగా, పరిహారం కూడా ప్రకటించరా...? రైతులంటే అంత అలుసా అంటూ దెబ్బతిన్న పంటలను చేతితో చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ, ఏవో రాధా, తహసీల్దార్ కె. శివ ప్రసాద్, కామారెడ్డి డీఎస్పీ డి.నాగేశ్వరరావు, భిక్కనూరు కామారెడ్డి సీఐ లు సంపత్ కుమార్, చంద్రశేఖర్, భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అలాగే పంట నష్టాన్ని, నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపామని ఏడీఏ అపర్ణ తెలిపారు. గ్రామాల్లోకి వచ్చి ఫీల్డ్ విజిట్ చేయకుండా పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని ఆందోళనకు దిగిన బాధిత రైతులు ఒక్కసారిగా మండిపడ్డారు. అంతటితో ఊరుకోకుండా గ్రామాల్లోకి ఎప్పుడు వచ్చారంటూ నిలదీశారు.

     రైతులంటే అంత చిన్న చూపా....? మా బాధ మీకు అర్థం కావడం లేదా..? సాగు కోసం పెట్టిన పెట్టుబడులతో పాటు, చేసిన కష్టం వృథా అయిపోయి రోడ్డున పడ్డామని, ఇక మాకు దిక్కెవరు అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. నెల కాగానే మీకు జీతం వస్తుంది, మాగోస మీకు ఎలా అర్థమవుతుందంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ప్రకటించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తేల్చి చెప్పారు. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ హైవేపై గంటన్నరపాటు ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా రైతుల ఆందోళన వద్దకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను,

    స్పెషల్ ఫోర్స్ ను మోహరించారు. చివరకు ఉన్నతాధికారులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ముందుగా హైదరాబాద్ సైడ్ వెళ్లే రహదారిపై బైఠాయించిన రైతులను ఆందోళన విరమింపజేసి పక్కకు తప్పించారు. ఒకపక్క రోడ్డు క్లియర్ అయ్యాక కామారెడ్డి వైపు వెళ్లే మరో పక్క రహదారిపై కూర్చున్న రైతులను సముదాయించి వారిని కూడా రోడ్డు పక్కకు తప్పించి, హైవేపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ రేపటి వరకు పరిహారం ప్రకటించకపోతే... ఎల్లుండి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు తేల్చి చెప్పారు. డీఎస్పీ నాగేశ్వరరావు ఆందోళనకు దిగిన రైతులను సముదాయిస్తుండగా ఆగ్రహంతో ఊగిపోతున్న మరి కొంతమంది రైతులు రెండు రోజుల క్రితం పోటాపోటీగా వాళ్లు వీళ్లు వచ్చి దెబ్బతిన్న పంటలను పరిశీలించి వెళ్లారు తప్ప నష్టపరిహారం ఇప్పించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ తో మాట్లాడతా : ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి

ఆందోళన విరమించిన అనంతరం అక్కడికి చేరుకున్న ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి బాధిత రైతుల వద్దకు చేరుకున్నారు. ఏమైనా రిప్రెజెంటేషన్ ఇస్తే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడతానని అనగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాకు జరిగిన నష్టం మీకు తెలువదా అంటూ ప్రశ్నించారు. ఫీల్డ్ మీదికి వచ్చి పంట నష్టాన్నిఅంచనా వేయాలని, పరిహారం అందేలా చూడాలని, లేనిపక్షంలో మా ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక తయారు చేసి పంపిస్తామని, అప్పటివరకు ఓపిక పట్టాలని సూచించారు. 


Similar News