బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కి మంచి రోజులు వచ్చేనా ?

ఆసియా ఖండానికే తలమానికగా నిలిచి వేలాది రైతుల, కార్మికుల జీవితాల్లో తియ్యదనం నింపిన బోధన్ నిజం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.

Update: 2024-02-05 10:53 GMT

దిశ, బోధన్ : ఆసియా ఖండానికే తలమానికగా నిలిచి వేలాది రైతుల, కార్మికుల జీవితాల్లో తియ్యదనం నింపిన బోధన్ నిజం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మూతపడి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కొరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. రెండు నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో బోధన్ రైతులు,

    కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే కృషి తోనే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సిఫార్సుల కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటుగా ప్రభుత్వ ఉన్నతాధికారులైన పరిశ్రమలు, ఆర్థిక, సహకార, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీలు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

ఫ్యాక్టరీ కి ఘన చరిత్ర...

హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1921 లో 1500 ఎకరాల్లో బోధన్ నిజాం చక్కెర కర్మాగారంను నెలకొల్పారు. కొంత కాలం తరువాత నిజాం షుగర్ కు అనుబంధంగా మెదక్, కరీంనగర్ లలో బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు. అనంతరం అభివక్త ఆంధ్రప్రదేశ్ లో నాటి ఆంధ్ర పాలకులు 2002 లో డెల్టా షుగర్ అనే ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేశారు. తదనంతరం ఫ్యాక్టరీని దివాలా తీయించి చివరకు ప్రైవేట్ పరం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కి బోధన్, ఎడపల్లి, రెంజల్

    మండలాల్లో వేలాది ఎకరాల సొంత భూమి ఉండేది. రెండు దశాబ్దాల క్రితం సుమారు 4 వేల కు పైగా ఎకరాల భూమిని వేలం వేసి అమ్మేశారు. 2004 లో ఏర్పాటైన వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో చక్కెర ఫ్యాక్టరీ ని అధ్యయనం చేయడానికి శాసన సభా సంఘాన్ని నియమించింది. ఈ సంఘం కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేసింది. తరువాత జరిగిన పరిణామాలతో అది సాధ్యం కాలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో తాజా మాజీ సీఎం కేసీఆర్ బోధన్ ను సందర్శించినప్పుడు

    తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీ ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపిస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఏడాదికే 2015 లో ఫ్యాక్టరీ కి లే ఆఫ్ ప్రకటించడంతో వందలాది కార్మికులు రోడ్డున పడ్డారు. చెరుకు రైతులు పండించిన చెరుకును కామారెడ్డి ప్రైవేట్ చెరుకు ఫ్యాక్టరీ కి, మహారాష్ట్ర కి తరలించారు. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ వచ్చింది.

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, కార్మికులు...

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషి మేరకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం తో రైతులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కార్మికులు ప్రభుత్వం ఏర్పరిచిన కమిటీ త్వరగా నివేదిక అందించి తమ జీవితాల్లో తియ్యదనం నింపాలని కోరుతున్నారు. 


Similar News