రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచడంలో టీఎన్జీవోస్ కీలక పాత్ర : షబ్బీర్ అలీ

దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచడంలో రాష్ట్ర టీఎన్జీవో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

Update: 2024-02-26 15:29 GMT

దిశ, కామారెడ్డి : దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచడంలో రాష్ట్ర టీఎన్జీవో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవోస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులు వారి జీతాల కోసం వేచిచూసే పరిస్థితి ఏర్పడ్డదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు నెల మొదటి తారీకు అందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా అందిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని తెలిపారు. టీఎన్జీవోల సమస్యలు,వారి తీర్మానాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

విద్యా, వైద్య శాఖలపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.విధుల్లో అలసత్వం చూపినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, టీఎన్జీవో నాయకులు మారం జగదీష్, వెంకట్ రెడ్డి, అలుక కిషన్, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్, సాయిలు, సాయి రెడ్డి, నాగరాజు, చక్రధర్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Similar News