గొర్రల కాపరికి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం

కూలి పని చేస్తే తప్ప పూట గడవని పేదరికం అ కుటుంబానిది.

Update: 2024-10-09 10:09 GMT

దిశ భిక్కనూరు : కూలి పని చేస్తే తప్ప పూట గడవని పేదరికం అ కుటుంబానిది. అయినా మొక్కవోని ధైర్యంతో పేదరికం జయిస్తూనే,గొర్ల కాపరిగా పని చేస్తూ కష్టపడి చదువుకున్నాడు. తనకున్న టాలెంట్ తో డీఎస్సీ రాసి ఫస్ట్ అటెంప్ట్ లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ పోస్ట్ సాధించి అందరిని ఔరా అనిపించేలా చేశాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కోరె కుమార్ ఫస్ట్ అటెంప్ట్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధించాడు. దీంతో కుమార్ తల్లిదండ్రులు కమల- బీరయ్య తోపాటు..వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సహాలు వెళ్లి విరుస్తున్నాయి. 4వ తరగతి వరకు భిక్కనూరు లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో..ఉన్న ఒక్కగానొక్క కొడుకును వారి కులవృత్తి అయిన గొర్ల కాపరిగా పనిలో పెట్టించారు. గొర్లు కాస్తూనే బాగా చదువుకొని ఎస్ఐ కావాలన్న పట్టుదలతో..ఓపెన్ టెన్త్ కామారెడ్డి డ్రైవర్స్ కాలనీలో చేశాడు. ఆ తరువాత ఇంటర్మీడియట్ భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో,డిగ్రీలో బీఏఈపిపి కామారెడ్డి డిగ్రీ కళాశాలలో పూర్తి చేశాడు. తన టాలెంట్ కు మరింత పదును పెట్టి హైదరాబాదులో నిజాం కళాశాలలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాడు. నిజామాబాద్ సారంగాపూర్ లో బీఈడీ పూర్తి చేసిన కుమార్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ పరీక్షలో చివరి నిమిషంలో టార్గెట్ మిస్ అయినప్పటికీ, అదే సంవత్సరం టెట్ అర్హత సాధించి, డీఎస్సీ రాశాడు. తొలి ప్రయత్నం లోనే స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా ఉపాధ్యాయ పోస్ట్ సాధించాడు. కుమార్ కులంలో, పట్టణ ప్రజల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. చదువు పేరుతో హైదరాబాద్ వెళ్లిన కుమార్ ను చదవట్లేదని, జులాయిగా తిరుగుతున్నాడని, వారి తల్లిదండ్రుల ముందే నాడు ఎన్నోసార్లు హేళన చేసిన వారే, నేడు పట్టుదలతో చదివి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధించి ఇంటికి తిరిగొచ్చిన కుమార్ ను,చేరదీసి శభాష్ రా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

Similar News