జిల్లాలో ‘ధరణి’ కష్టాలు..! కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్న రైతులు

‘ధరణి’ పోర్టల్‌తో కొత్త సమస్యల్లో చిక్కుకున్న రైతుల తిప్పలు నేటికీ తప్పడం లేదు.

Update: 2024-10-09 02:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘ధరణి’ పోర్టల్‌తో కొత్త సమస్యల్లో చిక్కుకున్న రైతుల తిప్పలు నేటికీ తప్పడం లేదు. పొరపాట్లను సరిచేయాలని కోరుతూ.. రైతులు ప్రతి నిత్యం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భూముల వివరాలను ఆన్‌‌లైన్‌లో నమోదు చేసేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పులు రైతులకు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. అధికారులు, రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. గెట్టు పంచాయతీలతో సతమతమవుతున్నారు. భూ వివాదాలను పరిష్కరించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో చాలామంది రైతులు భూముల కోసం గొడవలు పడుతూ పోలీస్ స్టేషన్లలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని కోర్టు మెట్లెక్కారు.

ఇప్పటికీ ధరణి పేరిట అధికారులు చేసిన తప్పులకు, ధరణిలో జరిగిన పొరపాట్లు సరి చేయకపోవడంతో రైతులు కొట్టుకుంటున్నారు. ధరణి తాలూకా అవస్థలు రైతులను కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారులకు మాత్రం జేబులు నింపుకోవడానికి ధరణి ఓ ఆర్థిక వనరుల మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ధరణిలో దొర్లిన తప్పులు రైతులకు తిప్పలు తీసుకొస్తే అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి మాత్రం అడ్డదారిలో అడ్డగోలుగా సంపాదించుకునే ఆదాయ వనరుగా మారింది. ధరణిలో సరి చేయడానికి అవకాశం ఉన్న చిన్నపాటి పొరపాట్లను కూడా పరిష్కరించకుండా అధికారులు అమాయక రైతులను మోసం చేస్తున్నారు. అందిన కాడికి దండుకుని సమస్య పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ధరణిని తెర మీదకు తీసుకొచ్చింది. అంతకు ముందు రైతులకు భూములకు సంబంధించి పట్టా పుస్తకం, టైటిల్ డీడ్ పుస్తకాలు వేర్వేరుగా ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వీటి స్థానంలో రెండు పుస్తకాలు వేర్వేరుగా కాకుండా పట్టా పుస్తకం పేరుతో ఒకే పుస్తకంలో భూ వివరాలు అన్ని నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. వాటి వివరాలు ధరణిలో నమోదు చేశారు. అయినప్పటికీ ధరణిలో అడుగడుగునా తప్పులే నమోదయ్యాయనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ధరణిలో దొర్లిన పొరపాట్లను సరిచేసుకునేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌లోనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఇప్పటికే వేలాదిగా బాధిత రైతులు సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కారణాలు ఏమిటో అధికారులను అడిగితే సరిగా చెప్పడం లేదని రైతులు వాపోతున్నారు.

గతంలో సమస్యలు అన్ని తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం

రైతులకు సంబంధించిన ఎలాంటి భూ వివాదాలైనా, భూ వివరాల్లో తప్పులు దొర్లినా, సర్వే నెంబర్లు, విస్తీర్ణం నమోదులో పొరపాట్లు మొత్తం తహసీల్దార్ స్థాయిలోనే మండల స్థాయిలో పరిష్కారం అయ్యేవి. రైతులు కూడా తమ సమస్యలు పరిష్కారం చేసినందుకు అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి ఏ లెవెల్ వారికి ఆ లెవెల్‌లో ముడుపులు ముట్టజెప్పి పనులు చేయించుకునే వారు. ఇది రైతులకు అంత ఇబ్బందికరంగా ఉండేది కాదు. ఒకవేళ సమస్యను పరిష్కరించడంలో అధికారులు సహకరించకపోతే రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తితో పైరవీలు చేయించుకుని పనులు చక్కబెట్టుకునే వారు. కానీ, ధరణి వచ్చాక ఎవరి పప్పులు ఉడకట్లేదని రైతులు, ప్రజాప్రతినిధులు, పైరవీకారులు అంటున్నారు. ధరణిలో సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష కారణాలతో దరఖాస్తులు పరిష్కారం కాకుండానే దరఖాస్తులు రిజెక్ట్ అయిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయని బాధితులు చెపుతున్నారు. అందుకు గల కారణాలు కూడా చెప్పడం లేదని బాధితులు వాపోతున్నారు.

ఐదేళ్లుగా తిరుగుతున్నా ఫలితం శూన్యం

ఐదేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా.. తమ భూ సమస్య పరిష్కారం కావడం లేదని చెప్పే రైతులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు వీఆర్వో, గిర్దావర్, డీటీలకు ధరణిలో జరిగిన పొరపాట్లను సరిచేయడానికి ఎన్నోసార్లు డబ్బులిచ్చామని చెప్పే వారు ఎందరో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు అధికారుల అక్రమాల గురించి ఇదివరకే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. భీమ్‌గల్ మండలం బడాభీమ్ గల్‌లో ఇది వరకు పని చేసిన ఓ వీఆర్వో తెలంగాణ పట్టాపాస్ పుస్తకాలు జారీ చేసేటప్పుడు రైతుల నుంచి అడ్డగోలుగా ముడుపులు తీసుకుని ఒకరి భూమిని ఇంకొక రైతు పేరున నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం అప్పట్లో అధికారుల దృష్టికి కూడా బాధిత రైతులు తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం రైతుల సమస్యలు కూడా పరిష్కరించ లేదు. ఆ వీఆర్వో మాత్రం బడా భీమ్‍‌గల్‌లో రైతుల నుంచి దాదాపు రూ.‌80 లక్షల మేర సంపాదించినట్లుగా గ్రామంలో చర్చించుకుంటున్నారు.

ఒకరి భూమి ఇంకొకరికి..

బడా భీమ్‍గల్‌లో పుప్పాల గంగారాం అనే వ్యక్తికి చెందిన పట్టా భూమిలో 30 గుంటల భూమిని ఆయన బంధువు పేరిట ఉన్న పాస్ పుస్తకంలో నమోదు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకంలో విస్తీర్ణం సరిగానే ఉన్నప్పటికీ తరువాత గుట్టుచప్పుడు కాకుండా గంగారాం భూమిలో 30 గుంటల భూమిని ఆయన బంధువుల పేరున చేర్చారు. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణానికి ఆన్‌లైన్‌లో ఉన్న భూమి విస్తీర్ణానికి తేడా ఉండటంతో ఆఫీసు చుట్టూ.. అధికారుల చుట్టూ నాలుగైదేళ్లుగా తిరుగుతున్నా పని కావడం లేదని చెపుతున్నాడు. ఇప్పటి వరకు కాళ్లు అరిగేలా తిరిగా రూ.లక్ష వరకు ముడుపులు ముట్టజెప్పినట్లుగా చెపుతున్నాడు. ఎవరైనా తన సమస్య పరిష్కరిస్తే ఇంకో రూ.50 వేలు కూడా ఇస్తాననని చెబుతున్నాడు.

పైసలు పోతేపాయే కానీ, తన సమస్య పరిష్కారమైతే చాలని అంటున్నారు. అప్పులు చేసైనా సరే డబ్బులిచ్చి పనులు చేయించుకునేందుకు చాలామంది రైతులు సిద్ధంగా ఉన్నామని చెపుతున్నారు. ఎందుకంటే మా భూమి తమకు దక్కుతుందో లేదో అన్న భయంతో చచ్చే కన్నా అప్పులు చేసైనా పైసలు ఖర్చు చేసుకుని పని చేయించుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని చెపుతున్నారు. ధరణి కారణంగా ఎలాంటి మానసిక వేధనతో రైతులు బతుకుతున్నారో వారిని కదిపితే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.


Similar News