మూడు నెలలైనా శాంపిల్స్ నిర్ధారణ ఇంకా పూర్తి కాలేదా సారు..?

రైతులు దేశానికి వెన్నెముక,రైతు లేని రాజ్యం లేదు అనే సూక్తులు వినడానికి వినసొంపుగా ఉంటాయి కానీ..అసలు రైతు గురించి పట్టించుకునే అధికారులు కరువయ్యారు.

Update: 2024-10-09 12:49 GMT

దిశ,గాంధారి: రైతులు దేశానికి వెన్నెముక,రైతు లేని రాజ్యం లేదు అనే సూక్తులు వినడానికి వినసొంపుగా ఉంటాయి కానీ..అసలు రైతు గురించి పట్టించుకునే అధికారులు కరువయ్యారు. తెలిసి తెలియక ఫెర్టిలైజర్ షాపు యజమాని ఇచ్చిన మందు వాడడంతో..పూర్తి పంట నష్టం జరిగింది. దీంతో శాస్త్రవేత్తలు వచ్చి శాంపిల్స్ తీసుకెళ్లారు. రిపోర్ట్స్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు తప్ప..రిపోర్ట్ లు మాత్రం రావడం లేదు. దీంతో ఆయా శాఖల పనితీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది.

నాయకులేమో రైతుల కోసమే మేమంతా ,ధర్నాలు, రాస్తారోకోలు,అహర్నిశలు, రైతు కోసం కృషి చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతుంటే ..అధికారులు వాళ్ల చేతుల్లోని పని చేసేందుకు ఇంకా టైం దొరకడం లేదు. వివరాల్లోకి వెళితే..కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో చద్మాల్ తాండ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు గడ్డి మందు కొన్నారు. గడ్డి మందు ఇవ్వమని ఫెర్టిలైజర్ షాపు యజమానిని అడిగితే..ఈ మందు వాడండి కొత్తగా వచ్చిందని చెప్పడంతో తక్కువ డబ్బుతో లాభం పొందచ్చని రైతులు అదే మందుని కొని, పిచికారి చేశారు. అప్పటికే ఏపుగా మొలకెత్తిన మొక్కజొన్న పంట గడ్డి మందు పిచికారి చేయడంతో..మొక్కజొన్న పంట కాస్త నేలకొరిగింది. దీంతో సదరు విత్తన షాపుల యజమానిని వివరణ కోరగా.. నేను చెప్పిన డోసు కంటే అధిక డోసుల్లో మీరు వాడినట్లు ఉన్నారని సమాధానం చెప్పాడు. దీంతో రైతులు చేసేదేం లేక వ్యవసాయ అధికారిని ఆశ్రయించడం జరిగింది.

ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ,హైదరాబాద్ నుంచి ప్రత్యేక వ్యవసాయ సంచాలకుల ఆధ్వర్యంలో..మొక్కజొన్న పడిపోవడానికి గల కారణాలను వెలిగి తీసేందుకు వాటి శాంపిల్స్ తీసుకెళ్లారు.సరిగ్గా నేటికి మూడు నెలలు అవుతున్న ఇంకా రిపోర్ట్ లు రాకపోవడంతో..ఏదైనా తప్పుదోవ జరుగుతుందా అనే అనుమానం రైతులలో కలిగిందని రైతులు తెలిపారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..మాకు ఉన్న ఐదు ఎకరాలలో ఒక ఎకరంకు తప్ప మిగతా అన్ని ఎకరాలకు ఈ గడ్డి మందును పిచికారి చేయగా..పూర్తిగా పంట పడిపోయిందన్నారు. అంతేకాకుండా మరొక రైతు తన రెండు ఎకరాల్లో పూర్తిగా పిచికారి చేయడంతో ..రెండు ఎకరాలు చేతికొచ్చిన పంట తన కళ్ళముందే ఇలా అయిపోవడం పట్ల అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇప్పటికే మూడు నెలలు గడిచిపోతున్న అనేక సార్లు ఆయా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా రిపోర్ట్ రాలేదు, రిపోర్ట్ రాగానే పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు చెప్పడంతో..రైతులు ఆశగా ఎదురుర చూస్తున్నారు. మూడు నెలల టైం పడుతుందంటే అంత చిన్న విషయం కాదు..తప్పనిసరిగా తమకు న్యాయం జరగాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శాస్త్రవేత్తలపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమను ఆదుకోవాలని రైతులు గోడును వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రిపోర్ట్ల నివేదిక నిష్పక్షపాతంగా ఉండి.. సదరు రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


Similar News