ఇందూరులో ఇదే మొదటి శ్రీవారాహి మాత ఆలయం
వారాహి మాత ఆది పరాశక్తి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 15: వారాహి మాత ఆది పరాశక్తి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ఆదివారం నగరంలోని అమ్మ నగర్ వెంచర్ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వారాహిమాత దేవాలయం అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ధన్ పాల్ దేవాలయ అంకురార్పణ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిజామాబాద్ నగరంలో మొట్టమొదటి శ్రీ వారాహి మాత ఆలయం ఇదే కాబోతోందన్నారు. ఈ ఆలయ ప్రాంగణానికి సహకరించిన అమ్మ వెంచర్ కమిటీ అధ్యక్షులు నరేష్ కు, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతోనే ఆలయ నిర్మాణ సంకల్పం జరిగిందన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆప్త మిత్రుడు మంచాల జ్ఞానేందర్ స్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. వారాహి మాత అమ్మవారి ఆలయం ఇందూరు నగరంలోనే ప్రత్యేక ఆలయంగా ఉండాలని, భక్తులకు కొంగుబంగారంగా నిలవాలన్నారు. ఫిబ్రవరి 10 న శ్రీ హంపి పీఠాధిపతి చేతులమీదుగా భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ వెంచర్ కమిటీ సభ్యులు, హార్ట్ ఫుల్ యువర్ వాకింగ్ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.