ఇది 'పవర్ ఫుల్' తెలంగాణ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఇది 'పవర్ ఫుల్' తెలంగాణ అని, వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరణకు కర్మ, కర్త, క్రియ సీఎం కేసీఆరేనని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
దిశ, ఆర్మూర్ : ఇది 'పవర్ ఫుల్' తెలంగాణ అని, వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరణకు కర్మ, కర్త, క్రియ సీఎం కేసీఆరేనని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అన్ని సబ్ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. సబ్‌స్టేషన్ల వద్ద ప్రజలు, రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కష్టాలను ఎలా అధిగమించిందో రైతులకు వివరించారు.
విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ గ్రామాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ జరిగిన 'విద్యుత్ దినోత్సవం'లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ గారి శ్రమతో నాటి చీకట్లు మాయం, నేడు వెలుగు జిలుగుల మయం అని ఆనందం వ్యక్తం చేశారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాలో తెలంగాణే నెంబర్‌వన్ అని అన్నారు. నాడు కరెంట్ ఉంటే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త అని అన్నారు. విద్యుత్ శాఖ విజయం వల్లే కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుగుతున్నామని అన్నారు.
ఎటుచూసినా వరి కోతలు తప్పా విద్యుత్ కోతలు లేవన్నారు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గానికే రూ.320 కోట్ల విద్యుత్ సబ్సీడీ వచ్చిందన్నారు. మోటార్లకు మీటర్లు పెడుతున్న మోదీ సర్కారుకు మీటర్ బిగిద్దామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలోనే తెలంగాణ విద్యుత్ రంగం అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. తెలంగాణ ఏర్పడితే చీకటే అన్న వారి జోస్యం తప్పని నిరూపిస్తూ తెలంగాణ అంతటా విద్యుత్ వెలుగులు నింపుతోంది విద్యుత్ శాఖ అని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో సాధించిన విజయం అసాధారణమైనది అన్నారు. ఉచిత విద్యుత్తు కోసం ఏటా రూ.12 వేల కోట్ల నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఉచిత విద్యుత్, విద్యుత్తు రంగంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం రూ.75 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటే అందుకు కారణం సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమని అన్నారు.