నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు

Update: 2024-11-22 15:44 GMT

దిశ,నిజాంసాగర్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికావస్తున్న సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు..200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఆరు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తనకు, ప్రభుత్వానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పార్టీ శ్రేణులను కోరారు. అదేవిధంగా మండలాల్లోని రోడ్లు,మౌలిక సదుపాయాలు, విద్య,వైద్యం,వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ వ్యతిరేక శక్తులు కొందరు ఏకమై పార్టీ ప్రతిష్టను దిగజార్చి పార్టీని చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని,ఆ దుష్ట శక్తుల కుట్రలు తిప్పి కొట్టేవిధంగా మన తదుపరి కార్యాచరణ ఉండాలని దిశా నిర్దేశం చేశారు.


Similar News