తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలను ఆన్ లైన్ లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.

Update: 2024-11-22 12:34 GMT

దిశ, నందిపేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలను ఆన్ లైన్ లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి,ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఒక్కో దరఖాస్తు వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఎంత సమయం పడుతోందని కలెక్టర్ ప్రశ్నించగా, సుమారు 15 నిమిషాల వ్యవధి అవుతోందని ఆపరేటర్లు తెలిపారు. ఎన్యూమరేటర్, సూపర్వైజర్ల లింక్ ను జతపరుస్తూ, వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని అన్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ, అన్ని వివరాలను ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ హితవు పలికారు. త్వరితగతిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని, శిక్షణ సందర్భంగా సూచించిన అంశాలను తు.చ తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో..విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా,సాంకేతికపరమైన సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు.


Similar News