వాటర్ ట్యాంకర్ ను ఢీకొన్న ఆర్టీసీ...ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి విషమం

డివైడర్ మధ్యన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ ను వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

Update: 2024-02-29 11:11 GMT

దిశ, భిక్కనూరు : డివైడర్ మధ్యన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ ను వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీహెచ్​ఎస్ చౌరస్తాలోని 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్​ నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు జీఎంఆర్ సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్ ని వెనకాల నుంచి వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

    ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న 45 మందిలో పదిమంది గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్ ను చికిత్స నిమిత్తం వెంటనే అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ లగ్జరీ బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ విషయం తెలిసిన వెంటనే సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా అందులో ఉన్న ప్రయాణికులను వేరే బస్సుల్లో ఎక్కించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


Similar News