విద్యుత్​ తీగల నుంచి మంటలు చెలరేగి జొన్న చేను దగ్ధం

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి చేతికొచ్చిన జొన్న పంట కాలి బూడిదైన ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.

Update: 2024-02-29 09:16 GMT

దిశ, తాడ్వాయి : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి చేతికొచ్చిన జొన్న పంట కాలి బూడిదైన ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...తాడ్వాయి గ్రామానికి చెందిన బండారి రాములు రెండు ఎకరాలలో జొన్న పంట సాగు చేస్తున్నాడు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందుతుందని ఆశపడేలోపే నిరాశే మిగిలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పంట చేనులోంచి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా కిందికి వేలాడుతూ ఉన్నాయని విద్యుత్ ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు.

    దాంతో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ఒకదానికి ఒకటి తగిలి మంటలు చెలరేగి పంట కాలి బూడిద అయిందని రైతు పేర్కొన్నాడు. మరోపక్క ప్రమాదకరంగా ఉన్న వైర్లతో ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియడం లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని బోరున విలపించాడు. పంట కాలి బూడిద కావడంతో సుమారు రూ.30 వేల పంట నష్టం జరిగినట్లు తెలిపాడు. తమ ప్రాణం పోతే కానీ అధికారులల్లో చలనం వస్తుందేమోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు జరిగిన పంటకు నష్టపరిహారం అందజేయాలని కోరారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ సరిచేసి రైతుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. 


Similar News