పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సంప్రదాయ చేతి వృత్తులు, హస్త కళాకారులను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికంగా చేయూత అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు.

Update: 2024-02-07 14:48 GMT

దిశ, కామారెడ్డి : సంప్రదాయ చేతి వృత్తులు, హస్త కళాకారులను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికంగా చేయూత అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో పథకం అమలుకు ఏర్పాటు చేసిన జిల్లా అమలు కమిటీ మొదటి సమావేశంలో మాట్లాడుతూ... పథకం పట్ల గ్రామ, పట్టణ స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. చేతి, కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో సామర్థ్యం మెరుగుపరిచి ఉత్పాదకత నాణ్యత, ఉత్పత్తులను పెంచడం ఈ పథకం ఉద్దేశమన్నారు. పథకంలో చేరడం వల్ల విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడీ కార్డు తో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకొనుటకు కావలసిన శిక్షణ, టూల్ కిట్స్, రుణ సదుపాయం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకం, మార్కెటింగ్ చేసుకొనుటకు ప్రభుత్వ మద్దతు లభిస్తుందని అన్నారు.

     కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉప్పరి, ఎరుకల, దర్జీ, చీపుర్లు, బుట్టల తయారీ, చెప్పులు కుట్టేవారు, పనిముట్లు, తాళాల తయారీ, శిల్పి, బొమ్మల తయారీ, చేపల వల, దండలు చేసేవారు, తాపీ పని లాంటి 18 కులవృత్తులు వంశ పారంపర్యంగా కొనసాగిస్తున్న వారందరినీ విశ్వకర్మలుగా పిలుస్తారని, వీరందరూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా కుల వృత్తులు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక చేయూత అందించనుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హులని, ఎలాంటి విద్యార్హత లేకున్నా పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. కాగా గతంలో పీఎంఈజీపీ, స్వనిధి, ముద్ర వంటి పథకాల ద్వారా లబ్ది పొంది ఉండరాదని, కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. విశ్వకర్మగా పేరు నమోదు కొరకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, మొబైల్ నెంబరుతో రిజిస్టర్ చేసుకోవాలని,

    అట్టి దరఖాస్తులను గ్రామ పంచాయతీ స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయి అమలు కమిటీ పంపుతుందని, ఆ కమిటీ పరిశీలించి లబ్ధిదారుల నమోదుకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు పంపుతుందని, రాష్ట్ర స్థాయి కమిటీ సంతృప్తి చెందిన తరువాత రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చి ప్రధాన మంత్రి విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడీ కార్డు జారీచేస్తుందని తెలిపారు. తదుపరి బ్యాంకుకు పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎంపికైన వారికి రెండు రకాలుగా శిక్షణ ఇస్తామని అన్నారు. ప్రాథమిక నైపుణ్యం ద్వారా 5 నుండి 7 రోజులు, అధునాతన నైపుణ్యానికి 15 రోజులు శిక్షణ అందిస్తూ.. శిక్షణా కాలంలో ప్రతి రోజూ 500 రూపాయల భృతి ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం15 వేల రూపాయల విలువైన టూల్ కిట్లు, ధ్రువీకరణ పత్రం అందజేస్తామని తెలిపారు. మూడు విడతలుగా లక్ష, రెండు, మూడు లక్షల వరకు రుణం అందజేస్తామన్నారు. మొదటి విడతలో 5 శాతం వడ్డీతో లక్ష రూపాయల రుణం అందజేస్తామని,18 నెలల్లో చెల్లించాల్సి ఉంటుందని,

    రెండో విడతలో రూ.2 లక్షలను అందజేస్తామని 36 నెలల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దశల వారీగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అర్హులైన అందరికీ లబ్దిచేకూర్చడం జరుగుతుందని, ఈ విషయంపై స్వయం సహాయక బృందాలు, ఇతరులు గ్రామ, పట్టణ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 16 న చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, చేతివృత్తులు, హస్త కళల వారు ఆత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎంఈ సహాయ సంచాలకులు రాజేష్ కుమార్ యాదవ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లాలు నాయక్, రఘునందన్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ భార్గవ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, డీపీఓ శ్రీనివాస్, జిల్లా పరిషత్​ డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ సురేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News