విద్య, వైద్యం, ఉపాధిలపై ప్రత్యేక దృష్టి సారిస్తా

సమాజాభివృద్ధి కోసం విద్య, వైద్యం, ఉపాధి లపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Update: 2024-02-29 11:02 GMT

దిశ, ఆర్మూర్ : సమాజాభివృద్ధి కోసం విద్య, వైద్యం, ఉపాధి లపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లోని కోటార్ మూర్లో గల కస్తూర్బా (కేజీబీవీ)బాలికల పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. పాఠశాల స్థితిగతులు, సౌకర్యాలు, సమస్యలు, పరిశుభ్రత మొదలైన అంశాల గురించి సిబ్బంది, విద్యార్థినులతో చర్చించారు. క్లాస్ రూమ్ లను, హాస్టల్ గదులను కలియ తిరిగారు. మొదట విద్య, వైద్యం కు ప్రాధాన్యం ఇస్తా అని, అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేయించేలా ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువస్తానన్నారు.

     ప్రతి విద్యార్థినికి పౌష్టిక ఆహారం అందేలా చూడాలని పాఠశాల ప్రత్యేక అధికారినికి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ స్థానానికి కోట్ల నిధులు తీసుకెళ్తున్నాడని మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ కు ఇస్తున్న ప్రాధాన్యత ఆర్మూర్ కు ఉండాలని కోరారు. మళ్లీ దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణల మధ్య గొడవలు చేయవద్దని, ఇలాంటి కక్ష సాధింపు చర్యల వల్ల ఉత్తర తెలంగాణలో ఉపాధి లేక నిరుద్యోగం పెరిగి నక్సలిజం వైపు ప్రజలు మరలే అవకాశం ఉందన్నారు.

     ఉత్తర తెలంగాణ అభివృద్ధికి దూరమై నక్సలిజం పెరగాలని ఆలోచిస్తున్న దక్షిణ తెలంగాణ మంత్రులు ఇకనైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్మూర్ పై కక్ష సాధిస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిని గంగామణి, బీజేపీ నాయకులు కలిగోట్ గంగాధర్, ఆకుల శ్రీనివాస్, మందుల బాలు, ధ్యగ ఉదయ్, కొట్టాల సుమన్, పోల్కం వేణు పాల్గొన్నారు.

ఆర్మూర్ లో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ సుందరీకరణ పనులకు శంకుస్థాపన

ఆర్మూర్ లోని శివాజీ చౌక్ గోల్ బంగ్లా వద్దగల చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ సుందరీకరణ పనులకు గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. హిందూ బాంధవులు గర్వించేలా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ సుందరీకరణ పనులను చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కలిగోట గంగాధర్, ఆకుల శ్రీనివాస్, ఉదయ్, మందుల బాలు, నిఖిల్, బీజేపీ, వీహెచ్ పీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News