ఫస్ట్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయాలి.. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

డ్యూటీకి రాగానే ఫస్ట్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయాలని, ఆ తరువాతే పనులు మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.

Update: 2024-09-28 12:15 GMT

దిశ, భిక్కనూరు : డ్యూటీకి రాగానే ఫస్ట్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయాలని, ఆ తరువాతే పనులు మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో హైవే పక్కన ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన విజిట్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్ రూంకు వెళ్లి విద్యార్థులకు పెట్టే భోజనానికి సంబంధించి నిత్యావసర సరుకులను, కూరగాయలను దగ్గరుండి పరిశీలించారు. ఆ తరువాత విద్యార్థులతో కలసి భోజనం చేశారు. పాఠశాల నిర్వహణకు సంబంధించి రికార్డులను పరిశీలించడంతో పాటు, ముఖ్యంగా అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది ఒకరు డ్యూటీలో ఉన్నప్పటికీ అటెండెన్స్ ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించాడు. దీంతో ఆమెను పిలిచి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేశాకే డ్యూటీ పనులు మొదలు పెట్టాలన్నారు. అక్కడి నుంచి పదవ తరగతి విద్యార్థినిలు ఉన్న గదికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా...? ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రశ్నించగా విద్యార్థినిలు సమస్యలేమి లేవన్నారు. స్కూల్ నుంచి త్రిబుల్ ఐటీ, మెయిన్స్ఎంపికైన విద్యార్థుల డాటా పంపాలని, పాఠశాల ప్రిన్సిపాల్ ను అడగగా, ఇప్పటికైతే పాఠశాల నుంచి ఎవరు ఎంపిక కాలేదని తెలిపారు. విద్యార్థినులకు చక్కని విద్యా బోధన అందించి వారు ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చూడాలన్నారు. పాఠశాల పనితీరు బాగానే ఉన్నా, అందుకనుగుణంగా విద్యార్థినుల సంఖ్య లేకపోవడం పట్ల కలెక్టర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చెడిపోయిన బోర్ మోటర్ ను బాగు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి రాజు, కామారెడ్డి ఆర్డీవో రంగనాథ్, తహశీల్దార్ కే.శివప్రసాద్, మండల ప్రత్యేక అధికారిని రజిత, ఇంచార్జి ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, మండల విద్యాధికారి రాజ్ గంగారెడ్డి, పశువైద్యాధికారి డాక్టర్ దేవేందర్, ఏవో రాధ, పంచాయతీ కార్యదర్శి గుడిసె బాబు తదితరులు ఉన్నారు.

అద్దె కట్టని వారికి నోటీసులు పంపాలి..

మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కాంప్లెక్స్ కు సంబంధించి అద్దె కట్టని వారికి నోటీసులు పంపించాలని ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డిని ఆదేశించాడు. పాఠశాల విజిట్ చేసిన అనంతరం ఎంపీడీఓతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ విధమైన ఆదేశాలు జారీ చేశాడు. బకాయిలకు సంబంధించి పూర్తి రిపోర్ట్ తనకు పంపాలని సూచించాడు.


Similar News