ఆర్మూర్‌లో వారి కొంపముంచిన మిత్ర బేధం!

ఆశన్న గారి జీవన్ రెడ్డి.. ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే! పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.. రెండు సార్లు పోటీ చేసిన ఎమ్మెల్యే పదవిని అందుకోలేకపోయిన నేత!! వీరిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు! జీవన్ అంటే.. వినయ్! వినయ్ అంటే.. జీవన్! అన్నట్లు ఉండేది వీళ్ళ స్నేహబంధం.

Update: 2023-12-06 02:50 GMT

దిశ, ఆర్మూర్: ఆశన్న గారి జీవన్ రెడ్డి.. ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే! పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.. రెండు సార్లు పోటీ చేసిన ఎమ్మెల్యే పదవిని అందుకోలేకపోయిన నేత!! వీరిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు! జీవన్ అంటే.. వినయ్! వినయ్ అంటే.. జీవన్! అన్నట్లు ఉండేది వీళ్ళ స్నేహబంధం. మిత్రులంటే ఆషామాషీ మిత్రులు కాదు.. ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టి కష్టపడే తత్వం వీరిది! ఇద్దరి మధ్య కేవలం మిత్రుత్వమే కాదు.. వీరు వ్యాపార భాగస్వాములు కూడా! 2014 ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలిచిన తర్వాత.. ఈ ఇద్దరు మిత్రుల మధ్య విభేదాలు వచ్చాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే.. ఆప్త మిత్రులు కాస్త బద్ధ శత్రువులుగా మారిపోయారు. నాకు ఈ భూమి మీద ఉన్న ఏకైక శత్రువు జీవన్ రెడ్డి.. అని వినయ్! నాకున్న బద్ధశత్రువు వినయ్ రెడ్డి.. అని జీవన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించే స్థాయి కి వీరి మధ్య శత్రుత్వం పెరిగిపోయింది. స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా కూడా మారిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ చేసుకొని.. ఇద్దరూ ఓడిపోయారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో గతంలోని ఇద్దరు మిత్రులకు ఈ దఫ్ఫా అసెంబ్లీ ఎన్నికలు వారి మధ్య నేలకు ఉన్న మిత్ర బేధం కొంప ముంచింది. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు మిత్రభేదంతో పోటీపడి ఆ ఎమ్మెల్యే పదవిని ఇద్దరు అందుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 సంవత్సర అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఉద్యమ పంతాలో టిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డికి మిత్రులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నిమ్మల జలంధర్ ల సంపూర్ణ సహకారం తో పాటు ఉద్యమ నాయకుల తోడ్పాటు ప్రజల మద్దతుతో ఆర్మూర్ ఎమ్మెల్యేగా సుమారు పది వేల పైచిలుకు మెజారిటీతో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె ఆర్ సురేష్ రెడ్డి పై విజయం సాధించారు.

అటు తరువాత 2016, 17 సంవత్సరాల్లో మిత్రులతో విభేదాలు ఏర్పడి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మిత్రులైన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నిమ్మల జలంధర్ లకు దూరమయ్యారు. దీంతో అత్యంత ఆప్త మిత్రుడైన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తో పొసగక పోవడంతో అప్పట్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇతర టిఆర్ఎస్ పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన వారి మధ్యలో ఆశించిన స్థాయిలో స్నేహం చిగురించక దూరంగానే ఉంటూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో మిత్రభేదంతో అప్పట్లో వినయ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి పై బిజెపి పార్టీ అభ్యర్థిగా పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందగా ఆ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు.

ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరి కొంపముంచిన మిత్రభేదం..

2023 ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డి పోటీలో నిలువగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే బరిలో నిలిచారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మిత్ర బేధం ఈ ఇద్దరు మిత్రుల కొంపముంచి ఇద్దరినీ ఆ పదవిని అందుకో లేకుండా చేసింది. ఇదివరకు 10 సంవత్సరాల పాటు ఆర్మూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆశన్న గారి జీవన్ రెడ్డి ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమై ఘోర ఓటమి చవిచూశారు. పది సంవత్సరాలపాటు ఆర్మూర్ ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న జీవన్ రెడ్డికి, ఆర్మూర్ ఎమ్మెల్యే కావాలన్నా పట్టుదలతో పోటీచేసిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి లకు ఆ పదవి అందకుండా పోయింది. గతంలో మిత్రులైన ఇద్దరి నాయకుల మిత్రభేదంతో ఒక మిత్రుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి దూరం కాగా, మరో మిత్రుడు వినయ్ రెడ్డి ఆ ఎమ్మెల్యే పదవిని అందుకోలేక పోయారు.

రాకెట్‌లా దూసుకొచ్చి ఎమ్మెల్యే అయిన రాకేష్ రెడ్డి..

ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డి ఇద్దరు మిత్రుల మిత్రభేదం తో వారి మధ్యలో రాకెట్‌లా దూసుకు వచ్చి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ ,87 పల్లె ప్రజల మద్దతుతో ఆర్మూర్ ఎమ్మెల్యే పదవిని అందుకున్నారు. సరిగ్గా సుమారు 6 నెలల క్రితమే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్‌లో రాజకీయ వేయడం చేసి దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత ఆర్మూర్ గడ్డపై కాలు మోపిన తొలి రోజే ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరు ఊహించని రీతిలో భారీ జన సందోహం మధ్యలో ర్యాలీ నిర్వహించి ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ ర్యాలీలోని ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఆర్మూర్ గడ్డపై రానున్న రోజుల్లో తప్పకుండా కాషాయ జెండాను ఎగర ఎగరవేస్తామని పేర్కొని, ఆర్మూర్ ప్రజలు బిజెపిని ఆశీర్వదించాలని అప్పట్లో కోరారు.

పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవస్థాపకుడు పైడి రాకేష్ రెడ్డి, డైరెక్టర్ ఆయన కూతురు పైడి సుచరిత రెడ్డి, సతీమణి రేవతి రెడ్డిలు, ప్రధాన మద్దతుదారులు జాన్కంపేట్ సంతోష్ రెడ్డి, అంకాపూర్ సురేష్ రెడ్డి లు విస్తృతంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తూ ప్రజలకు నగదు ఆర్థిక సహాయాలు అందజేస్తూ ప్రజల్లోకి చొచ్చుకు పోయారు. రాకేష్ రెడ్డి ఫౌండేషన్ సహాయం తో పాటు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒక రూపాయికి వైద్య సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రజలతో పాటు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల మనసును రాకేష్ రెడ్డి గెలుచుకున్నారు. రాష్ట్ర రాజధానిలో రూపాయికి వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేయించిన రాకేష్ రెడ్డి ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, ఆర్మూర్ నియోజకవర్గంలో తిరుగులేని మెజారిటీతో అఖండ విజయాన్ని అందించిన ఆర్మూర్ నియోజకవర్గ నిరుపేద ప్రజల కోసం ఆర్మూర్ ప్రాంతాల్లో సైతం రూపాయి కే వైద్య సేవలను ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం అందుకుంటారని తెలుస్తుంది.

Similar News