సర్పంచ్ పోరుకు సన్నాహాలు..
మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దాని పై గ్రామాల్లో వాడివేడిగా చర్చ సాగుతుంది.
దిశ, ఏర్గట్ల : మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దాని పై గ్రామాల్లో వాడివేడిగా చర్చ సాగుతుంది. గ్రామాల్లో సర్పంచ్ పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 2తో ముగియగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూన్ 4వ తేదీతో ముగిసింది. స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది. గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాలన ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రజల నుంచి మాత్రం ప్రజా ప్రతినిధుల పాలనే కావాలని వెంటనే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తూ బీసీ కులగణనను రానున్న 60 రోజుల్లో పూర్తిచేసి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని డిసెంబర్ 9 వరకు రిజర్వేషన్లు ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న చెప్పడంతో డిసెంబర్ చివరలో లేదా జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పడంతో బీసీ నాయకులు ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. కానీ ఎలక్షన్ తేది ఎప్పుడు వస్తుందని ఆశావహులు, పోటీ దారులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఏర్గట్ల మండలంలో 8 గ్రామ పంచాయతీలు..
ఏర్గట్ల మండలం కొత్తగా ఏర్పడిన చిన్న మండలం. ఈ మండలంలో చిన్న గ్రామాలను కలుపుకొని మొత్తంగా 8 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పెద్ద గ్రామ పంచాయతీలోనే కాకుండా అతిచిన్న పంచాయతీలలో కూడా ఈసారి ఎన్నికలలో పోటీకి సై అంటూ ఉత్కంఠగా యువత ఆశావహులు ఎదురుచూస్తున్నారు. గతంలో కంటే ఈసారి ఏర్గట్ల మండలంలో పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వేషన్లు గత పాలకులకు అనుకూలంగా ఉంటే గతంలో సర్పంచులుగా గెలిచిన వారికి కూడా ఈసారి ఒకటి, రెండు గ్రామాలలో ఎదురుగాలి వీస్తున్నట్లు ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఇదే అదునుగా యువత మండలంలోని అన్ని గ్రామాల్లో ఎలక్షన్లలో పోటీలో నిలబడి తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
రిజర్వేషన్లు అనుకూలిస్తే మండల కేంద్రానికి చెందిన ఓ యువ నాయకుడిదే పై చేయి..
మండల కేంద్రంలో అయితే అతిపెద్ద మార్పు ఒక యువ నాయకుడి చేతిలో ఉండే అవకాశం ఉంది. ఆ యువ నాయకుడు మండల కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. అతనే ఏర్గట్ల రాజకీయాలలో సంచలన మార్పులకు కేంద్రంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఎప్పటి నుండో ప్రజలలో సేవా కార్యక్రమాలతో తనదైన శైలిలో జనాల హృదయాలలో మంచి స్థానం సంపాదిస్తున్నాడు. మంచి అనుభవం ఉన్న నాయకుడు ఏర్గట్ల మండల రాజకీయాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా శాశించే అవకాశాలు ఉన్నాయని, గతంలో చేసిన అభివృద్ధి పనులు గుర్తించి ఆయనను గెలిపిస్తారని ప్రజలు, యువత చర్చించుకుంటున్నారు.
రిజర్వేషన్లు మారుతాయా..?
గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతో పాత విధానంలోనే రిజర్వేషన్లు కొనసాగుతాయా లేదా మార్చుతారా అనే చర్చ గ్రామాల్లో జోరుగా సాగుతుంది. రిజర్వేషన్లు మారిస్తే పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ స్థానాలకు మరోసారి రిజర్వేషన్లు ప్రకటించాలని గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన ఓటర్ జాబితా ప్రకారంగా తీసుకునే అవకాశం ఉంది. సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం ముగిసి 8 నెలలు గడిచిపోవడంతో తాజాగా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే పాత రిజర్వేషన్లు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా, కొత్త ప్రభుత్వం మార్పులు చేస్తుందా ? అనే దాని పై ఉత్కంఠతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోటీకి సై అంటున్న నేతలు...
ఇప్పటికే ప్రస్తుత తాజా మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు గత మాదిరిగా రిజర్వేషన్లు అనుకూలిస్తే మరోసారి పోటీలో దిగేందుకు గ్రామస్థాయి నాయకులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ పై అధికారులు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయనప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తుందోననే ఆసక్తి ఆశావహుల్లో నెలకొంది. అయితే సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనగణన లెక్కలు తీయాలనే ఆలోచనతో కాస్త ఆలస్యంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ టీంను ఏర్పాటు చేయడంతో బీసీ జనగణనలో ఓటర్లను గుర్తించడానికి ప్రభుత్వం 60 రోజుల గడువు ప్రకటింటించింది. డిసెంబర్ 9 నాటికి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలుపడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అంత వరకు పోటీలో నిలవాలనుకునే నాయకులు యువత తమ తమ కార్యక్రమాలతో జనాల్లోకి చొచ్చుకెళ్లి ఓటర్ల గొంతమ్మ కోరికలను తీర్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారని, సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసుకుంటూ తనను తాను ఆకట్టుకునే పనిలో పడ్డారని యువకుల మధ్య చర్చ నడుస్తుంది.