పదవి అలంకారప్రాయం కాకూడదు

కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వాళ్ళ పదవులు అలంకార ప్రాయం కావద్దని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

Update: 2025-01-07 11:08 GMT

దిశ, కామారెడ్డి : కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వాళ్ళ పదవులు అలంకార ప్రాయం కావద్దని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. కామారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నూతన జూపల్లి పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నూతన పాలకవర్గ సభ్యులు మార్కెట్ కమిటీకి ఆదాయం వచ్చేలా, రైతుల శ్రేయస్సు కోసం కష్టపడాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారం దిశగా ఎదగాలని సూచించారు. కరీంనగర్ లోని ముల్కనూర్ సొసైటీని పాలకవర్గం సందర్శించాలని, అక్కడి విధానాలను ఇక్కడ అమలు చేసేలా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, ప్రజల ప్రభుత్వమన్నారు. ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నారని, అబద్దాన్ని వందసార్లు చెప్తే నిజమని నమ్మే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ ఎస్ కు లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతోందని తెలిసి కూడా నాడు సోనియాగాంధీ హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇచ్చారని,నాటి పాలకులు చేసిన అప్పుకు నూటికి 10 శాతం వడ్డీ చొప్పున 6500 కోట్లు నెలకీ వడ్డీ కడుతున్నామని తెలిపారు. వెళ్లే ముందు 40 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రతి మాట నిలబెట్టుకుంటున్నామని, ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఆదాయ వనరులు దండిగా ఉండి కూడా నాడు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారని, ప్రగతి భవన్ వెళ్తే గేట్లు బంద్ చేసేవారన్నారు. విగ్రహాలు పెట్టడం గొప్ప కాదు.. వాళ్ళను గౌరవించుకోవడం గొప్ప అని తెలిపారు. మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి చనిపోతే ఆయన అంత్యక్రియలకు కేసీఆర్ ఎందుకు పోలేదని, కాలు లేదా.. కర్ర పట్టుకుని నడుస్తున్నాడా.. అని ఎద్దేవా చేశారు. కనీసం అసెంబ్లీకి వచ్చి అయినా నివాళులర్పించారా అని ప్రశ్నించారు. కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించి టూరిజంగా మార్చేలా అభివృద్ధి చేస్తానని, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడం కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజాగౌడ్, వైస్ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, డైరెక్టర్లతో పాటు మాజీ ఛైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.

హైకోర్టు తీర్పు కేటీఆర్ కు చెంపపెట్టు..

ఏసీబీ కేసులో కేటీఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడం ఆయనకు చెంపపెట్టు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఏసీబీ విచారణను కేటీఆర్ ఎదుర్కొక తప్పదన్నారు. ప్రభుత్వం వచ్చిన సంవత్సరకాలంలోనే 55 వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చామని, మరో లక్షకు పైగా ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. కేసిఆర్ వరి వేస్తే ఉరే అన్నాడని, కానీ తమ ప్రభుత్వం సన్నరకం వరి పండించిన రైతులను ఆదుకున్నామన్నారు. తర్వాత ఎంపీ సురేష్ శెట్కార్ కూడా మాట్లాడారు.


Similar News