'ఇన్ని రోజులకు మా ఊరు గుర్తొచ్చిందా'.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయన్న ఆనందం మిగలడం లేదు.

Update: 2023-09-25 12:54 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయన్న ఆనందం మిగలడం లేదు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే గ్రామాల్లో తిరుగుబాటు మొదలైంది. ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుదామని అందుకోసం కార్యాచరణను సిద్దం చేసుకుంటున్న ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక మొదలయింది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేకు నిజాంసాగర్‌ మండలంలోని మల్లూర్‌ గ్రామంలో నిరసన సెగ తగిలింది. సోమవారం ఉదయం మల్లూర్‌ గ్రామంలో రూ 20 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభోత్సవానికి హన్మంత్‌ షిండే వెళ్ళగానే గ్రామస్థులు ఒక్కసారిగా రోడ్డుపై షిండేను అడ్డుకున్నారు. ఎన్నికల ముందు వచ్చిన మీరు తిరిగి మా గ్రామం ముఖం ఎన్నడైనా చూశారా? మీరు గొప్పలు చెప్పుకునే సంక్షేమ పథకాలు మా గ్రామంలో ఎన్ని అమలు చేశారు.


ఎప్పుడైనా మా గ్రామం గుర్తుకు వచ్చిందా అంటూ నిలదీశారు. తమ ప్రభుత్వం అది చేసింది, ఇది చేసిందని చెప్పుకునే మీరు మా గ్రామంలో చేసిన అభివృద్ది ఏముంది అంటూ షిండేను నిలదీయడంతో ఆయన చేసేదేమీలేక ఆరోగ్య ఉపకేంద్రంను ప్రారంభించి వెనుదిరిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే అనుచరులు కొందరు నేరుగా గ్రామస్తులను బెదిరించడం కలకలం రేపింది. కొందరు ఈ విషయాన్ని అక్కడ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, పోలీసులు కలుగజేసుకోవడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా కార్యక్రమం పూర్తిచేసుకుని ఎమ్మెల్యే వెళ్ళిపోయారు.


Similar News