పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

Update: 2024-09-25 15:50 GMT

దిశ, కామారెడ్డి : గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ, పారిశుధ్యం, ఇంటి పన్నుల వసూళ్లు, విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ వాయిదాల చెల్లింపులు, లే ఔట్స్, భవన నిర్మాణాల అనుమతులు, ఉపాధి హామీ, ప్రజా పాలన, వన మహోత్సవం, మహిళా శక్తి, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్వహణ, ఫాం పాండ్స్, అమ్మ ఆదర్శ పాఠశాలలు తదితర అంశాల పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభ్యుదయానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలను నిర్ణీత సమయంలో ప్రచురించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలని, ఇంకుడు గుంతలు, ఫాం పాండ్స్ నిర్మించుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. స్వచ్చత హే సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం క్రింద జాబ్ కార్డులు కలిగిన వారికి వంద రోజుల పనిదినాలు కల్పించాలని తెలిపారు. ఉపాధి హామీ పనుల క్రింద వ్యవసాయ అనుబంధ పనులు చేసుకోవచ్చని తెలిపారు. డ్రై డే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. గ్రామాలలో ఆస్తి పన్ను, సి.సి.చార్జీలు వసూలు లక్ష్యానికి అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. మహిళా శక్తి పథకంను ఎంపీడీవోలు మానిటరింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈఓ.చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, మండల అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఓటర్ల నమోదుకు సహకరించాలి..

అర్హత కలిగిన కొత్త ఓటర్లను నమోదు చేసుకునే విధంగా సహకరించాలని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు.

వచ్చే అక్టోబర్ 29న ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ ప్రచురిస్తామన్నారు. ఈ డ్రాఫ్ట్ రోల్ లో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే నవంబర్ 9, 10 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తామని, దానిలో ప్రతీ బూత్ స్థాయి అధికారికి తెలియపరచవచ్చని తెలిపారు. ఫైనల్ పబ్లికేషన్స్ జనవరి 6, 2025 న ప్రచురిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఇంటింటి సర్వే కామారెడ్డిలో 97.52 శాతం, జుక్కల్ లో 98.02 శాతం, ఎల్లారెడ్డిలో 99.24 శాతం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరళ, తదితరులు పాల్గొన్నారు.


Similar News