అధికారులు సమన్వయంతో పనిచేయాలి

జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు నియమించిన అధికారులు, బృందాలు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ కోరారు.

Update: 2024-03-19 14:11 GMT

దిశ, కామారెడ్డి : జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు నియమించిన అధికారులు, బృందాలు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ కోరారు. మంగళవారం ఆర్డీఓలు,డీఎస్పీలు, తహసీల్ధార్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రవర్తనా నియమావళి అమలు పై వర్క్ షాప్ లు ఏర్పాటు చేసి అవగాహన కలిగించాలన్నారు. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించవద్దన్నారు. పోలింగ్ మే 13 న పూర్తి ఎండా కాలంలో వస్తున్నందున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడను ఏర్పాటు చేయాలని, పోలింగ్ బూతులతో సరైన వెలుతురు, మంచినీరు, టాయిలెట్స్, ర్యాంప్, వీల్ చైర్ తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. తహసీల్ధార్లు ముందస్తుగా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి మౌలిక వసతులతో పాటు వల్నరబిలిటీ మ్యాపింగ్ చూడాలన్నారు. ఏప్రిల్ 25 వరకు ఓటర్ల నమోదుకు అవకాశముందని,

    అప్పటి వరకు వచ్చిన అన్ని ఫారాలను పరిష్కరించాలని, ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలని తహసీల్ధార్లకు సూచించారు. సభలు, సమావేశాలు, వాహనాలు, ఎల్.ఈ.డీ. స్క్రీన్ ల ద్వారా ప్రచారానికి, కరపత్రాల ముద్రణకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని అన్నారు. అక్రమంగా తరలుతున్న డబ్బు, మద్యం, కానుకలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేయాలని సూచించారు. సి విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే ఫ్లైయింగ్ స్క్వాడ్ ను అప్రమత్తం చేయాలని, ఆ బృందం కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. షెడ్యూల్ వెలువడి 72 గంటలు దాటినందున ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు, ఫోటోలు లేకుండా చూడాలన్నారు. 85 సంవత్సరాలు పై బడిన వృద్దులు, వికలాంగులకు ఇంటి వద్ద నుండే ఓటు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని,

    ఓటు వినియోగం కోసం ఫారం-12 ద్వారా అవకాశం కల్పించాలన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఓటరు ఎపిక్ కార్డులను వెంటనే పంపిణీ చేయాలని సూచించారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ... జిల్లాలోని రెండు అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, అటవీ, పొలీసు వంటి శాఖల సమన్వయంతో సమీకృత చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి డబ్బు, మద్యం, కానుకలు వంటి తరలింపులను గుర్తించి స్వాధీన పరచుకోవడంతో పాటు కేసులు నమోదు చేయాలన్నారు. పొలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సరిగ్గా ప్రవర్తనా నియమావళి అమలు జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్.డీ.ఓ.లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News